ఇంఫాల్‌ లోయ ప్రశాంతం

7 May, 2023 06:19 IST|Sakshi

మణిపూర్‌లో నెలకొంటున్న సాధారణ పరిస్థితులు

హింసాత్మక ఘటనల్లో 54కు చేరిన మరణాలు

ఇంఫాల్‌: మణిపూర్‌లో ప్రశాంతత నెలకొంటోంది. బుధవారం నుంచి మొదలైన హింసాత్మక ఘటనలు శుక్రవారం రాత్రి కూడా కొనసాగాయి. అయితే, శనివారం ఉదయం ఇంఫాల్‌ లోయలో దుకాణాలు, మార్కెట్లు తిరిగి తెరుచుకున్నాయి. రోడ్లపై వాహనాల రాకపోకలు మొదలయ్యాయని అధికారులు తెలిపారు. మైతి వర్గం ప్రజలకు ఎస్‌టీ హోదా ఇవ్వరాదంటూ బుధవారం చేపట్టిన ర్యాలీ సందర్భంగా మొదలైన హింసాత్మక ఘటనలు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకూ వేగంగా వ్యాపించాయి.

హింసాత్మక ఘటనల్లో చనిపోయిన వారి సంఖ్య శనివారానికి 54కు చేరుకోగా, క్షతగాత్రులు 200కు పైనేనని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి మరణాలు వందకు పైగానే ఉంటాయని అనధికార వర్గాల సమాచారం. ప్రభుత్వం, ఆర్మీ ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్లలో సుమారు 13 వేల మంది తలదాచుకోగా కొందరు పొరుగునే ఉన్న మిజోరం, మేఘాలయ, నాగాలాండ్‌లకు తరలివెళ్లారు. రాష్ట్రంలోని ప్రధాన రహదారులు, కీలక ప్రాంతాల వద్ద పెద్ద సంఖ్యలో ఆర్మీ జవాన్లు, కేంద్ర బలగాల గస్తీ కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు