Manipur Violence: మణిపూర్‌లో ఇప్పటికీ రగులుతోన్న కాష్టం.. 

3 Sep, 2023 12:35 IST|Sakshi

ఇంఫాల్: నాలుగు నెలల క్రితం మణిపూర్‌లో రగిలిన హింస తాలూకు కాష్టం ఇంకా మండుతూనే ఉంది. తాజాగా వారం రోజుల క్రితం ఆగస్టు 29న మరోసారి ఇంఫాల్‌లో హింసాకాండ రగులుకుంది. ఈ హింసలో మరో 8 మంది మరణించగా 20 మంది గాయపడ్డారు. దీంతో ఇంఫాల్‌లో మిగిలిన కుకీ కుటుంబాలను బలవంతంగా కొండ ప్రాంతాలకు తరలించాయి సాయుధ దళాలు. 

మెయిటీలు అత్యధికంగా నివసించే పశ్చిమ ఇంఫాల్‌ జిల్లాలోని లంబులానే ప్రాంతం నుండి అక్కడ మిగిలి ఉన్న స్వల్ప సంఖ్యాకులైన కుకీలను బలవంతంగా కొండప్రాంతానికి  తరలించాయి అక్కడి భద్రతా దళాలు. శుక్రవారం అర్ధరాత్రి సాయుధ దళాలు తమ ఇంటిని తలుపులను బలంగా కొట్టి నిద్రలో ఉన్నవారికి ఎక్కడికి వెళ్ళేది చెప్పకుండా తరలించారని అన్నారు అక్కడ నివసించే ఓ పెద్దాయన. 

లంబులానే ప్రాంతం నుండి తరలించబడింది రెవరెండ్ ప్రిమ్ వైఫే, హెజాంగ్ కిప్‌జెన్ తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 1,2 తేదీల్లో అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉండగా కేంద్ర భద్రతా దళాలు కనీసం తమ వస్తువులను వెంట తెచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా కట్టుబట్టలతోనే తమను బలవంతంగా బయటకు లాక్కుని వచ్చారని అక్కడే ఉన్న బులెట్ ప్రూఫ్ వాహనాల్లోకి ఎక్కించి కుకీలు ఎక్కువగా నివసించే కంగ్‌పోక్‌పి జిల్లాలోని మోట్‌బంగ్ ప్రాంతానికి తరలించారని అన్నారు. 

కేంద్ర భద్రతా దళాలు మాకు భద్రతా కల్పించాల్సింది పోయి ఇలా బలవంతంగా మమ్మల్ని తరలించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాము. భారతదేశం లాంటి మహోన్నత దేశం సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడటంలో విఫలమై సంఘ వ్యతిరేక శక్తుల ప్రలోభాలకు లొంగిపోయి పౌరులకు భద్రత కల్పించడంలో మన వ్యవస్థ దారుణంగా విఫలమైందని అన్నారు.   

ఈ బలవంతపు తరలింపులో భద్రతా దళాలు మొత్తం 10 కుటుంబాలకు చెందిన 24 మందిని తరలించామని భద్రతా దళాలు చెబుతున్నాయి. ఆగస్టు 27న లంబులానే ప్రాంతంలో అల్లరి మూకలు మూడు పాతబడ్డ ఇళ్లను దహనం చేశారని మిగిలిన వారికి కూడా ప్రమాదం పొంచి ఉందని సమాచారం రావడంతో వారిని హుటాహుటిన అక్కడి నుండి సురక్షితమైన ప్రాంతానికి తరలించామని తెలిపారు.  

మెయిటీలకు గిరిజన తెగగా గుర్తింపునిచ్చే అంశాన్ని పరిశీలించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించిన నేపథ్యంలో మే 3న మణిపూర్‌లో అల్లర్లు చెలరేగాయి. నెలరోజులకు పైగా కొనసాగిన ఈ హింసాకాండలో 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా సుమారు 50000 మంది తమ ఇళ్లను విడిచిపోయారు. రాష్ట్రమంతటా ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగినట్టే అనిపించినా ఈ మధ్యనే పశ్చిమ ఇంఫాల్‌లో మళ్ళీ అల్లర్లు జరగడంతో ఇంఫాల్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఇది కూడా చదవండి: సర్జికల్ స్ట్రైక్ హీరో చేతికి మణిపూర్ అల్లర్ల బాధ్యతలు

మరిన్ని వార్తలు