మణిపూర్‌లో ఇంకా ఆరని చిచ్చు... మరోసారి అల్లర్లు

6 Jun, 2023 14:41 IST|Sakshi

మణిపూర్‌లో మరోసారి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. జూన్ 5న రాత్రంతా సాగిన ఈ ఘర్షణల్లో ఒక బీఎస్‌ఎఫ్‌ జవాను మృతి చెందగా అస్సాం రైఫిల్ బలగాల్లోని ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సేవల వినియోగాన్ని జూన్ 10 వరకు పొడిచింది మణిపూర్ ప్రభుత్వం. 

స్వయంగా అమిత్ షా రంగంలోకి  దిగి... 
మణిపూర్ లో మే 3న జరిగిన అల్లర్లలో మెయితేయి కుకీ తెగల మధ్య దారుణ హింసాకాండ చోటు చేసుకుంది. సుమారుగా 70 మంది ప్రాణాలు కోల్పోయారు. మెయితేయి తెగ వారు తమని ఎస్టీల్లో చేర్చాలని చేస్తున్న డిమాండ్ ను కుకీ తెగ వారు వ్యతిరేకించడమే ఈ అల్లర్లకు ప్రధాన కారణం. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు 10 వేల  అస్సాం రైఫిల్ బలగాలను మోహరించాయి. ఈ రెండు తెగల మధ్య సమన్వయాన్ని కుదిర్చి రాష్ట్రంలో శాంతిని నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్ లో పర్యటించిన విషయం తెలిసిందే. 

తగ్గినట్టే తగ్గి... అంతలోనే మళ్ళీ... 
ఇప్పుడిప్పుడే పరిస్థితి సద్దుమణుగుతోందనుకుంటున్న తరుణంలో మళ్ళీ సోమవారం రాత్రి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మణిపూర్ సుగ్ను, సెరో ప్రాంతంలో బిఎసెఫ్ బలగాలకు, తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక బిఎస్ఎఫ్ జవాను మృతి చెందగా అస్సాం రైఫిల్ బలగాల్లోని ఇద్దరికి బులెట్ గాయాలయ్యాయి. ఇంకా ఉద్రిక్తత తగ్గని నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం వెంటనే ఇంటర్నెట్ సేవల నిషేధాన్ని జూన్ 10 వరకు మరో ఐదు రోజులపాటు పొడిగించింది. 

మరిన్ని వార్తలు