మనీష్‌ సిసోడియాను రేపు సీబీఐ అరెస్ట్‌ చేస్తుంది: ఆప్‌

16 Oct, 2022 15:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో సోమవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సీసోడియాకు సమన్లు జారీ చేయడంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. సీబీఐ రేపు మనీష్‌ సిసోడియాను అరెస్టు చేస్తుందని ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ జోస్యం చెప్పారు.

ఈ సమన్లు త్వరలో జరగనున్న గుజరాత్ ఎన్నికలకు సంబంధించి వచ్చాయని ఆరోపించారు. గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీకి ఆప్‌ గట్టి పోటీ ఇవ్వనుందని, దీంతో బీజేపీకి భయం పట్టుకుందని విమర్శించారు. ఈ క్రమంలోనే సిసోడియాకు సమన్లు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సీబీఐ తాజాగా సమన్లు జారీ చేయడంపై సిసోడియా ట్విటర్‌ ద్వారా స్పందించారు. గతంలో తన ఇళ్లు, బ్యాంక్‌, స్వస్థలంలో సీబీఐ 14 గంటలు సోదాలు చేసినప్పటికీ.. ఏం దొరకలేదని తెలిపారు. అందుకే ఇలాంటి చర్యలకు దిగుతోందని విమర్శించారు. అయినప్పటికీ సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.

ఇదిలా ఉండగా మనీష్‌ సిసోడియాకు ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మద్దతుగా నిలిచారు. డిప్యూటీ సీఎం సిసోడియాను స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌ సింగ్‌తో పోల్చారు. ఆనాడు జైలు, ఉరికంబం సింగ్‌ ధృడ సంకల్పాన్ని అడ్డుకోలేకపోయాయని గుర్తు చేశారు. ఇది స్వేచ్ఛ కోసం జరుగుతున్న రెండో పోరాటమని అభివర్ణించారు. మనీష్‌, సత్యేంధ్ర జైన్‌ నేటి భగత్‌ సింగ్‌లు అని ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు