పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. పరువు నష్టం దావా కేసులో సిసోడియాకు సుప్రీం వార్నింగ్‌

13 Dec, 2022 06:09 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆప్‌ ముఖ్య నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాను సుప్రీం కోర్టు తీవ్రంగా మందలించింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ దాఖలు చేసిన పరువు నష్టం కేసును కొట్టేయాలంటూ గువాహతి హైకోర్టును సిసోడియా ఆశ్రయించారు. అయితే కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 

జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, ఏఎస్‌ ఓకా నేతృత్వంలోని బెంచ్‌ సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. వాదనల సమయంలో ‘‘బహిరంగ చర్చను ఈ స్థాయికి తగ్గిస్తే పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అంటూ ఈ సందర్భంగా సిసోడియా న్యాయవాది ఏఎం సింఘ్వీని ఉద్దేశించి బెంచ్‌ వ్యాఖ్యానించింది. కరోనా లాంటి కష్టకాలంలో.. దేశం ఎదుర్కొన్న పరిస్థితులను చూసి కూడా, పిటిషనర్‌(మనీశ్‌ సిసోడియాను ఉద్దేశించి..) తీవ్ర ఆరోపణలు చేశాడంటూ బెంచ్‌ అభిప్రాయపడింది. దీంతో సింఘ్వీ తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండడంటూ బెంచ్‌ హెచ్చరించింది.

కరోనా మొదటి వేవ్‌ సమయంలో..  మార్కెట్‌ రేట్ల కంటే ఎక్కువ ధరకు పీపీఈ కిట్స్‌ను నేషనల్‌ హెల్త్‌ మిషన్‌కు సరఫరా చేయడం ద్వారా భారీ కుంభకోణానికి పాల్పడ్డారంటూ హిమంత బిస్వా శర్మపై సిసోడియా ఆరోపణలు గుప్పించారు. ఆ సమయంలో శర్మ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారని, ఆయన భార్యకు చెందిన కంపెనీకి ఆర్డర్లు కట్టబెట్టారంటూ సిసోడియా ఆరోపించారు. 

అయితే ఆ ఆరోపణలను కొట్టిపారేసిన శర్మ.. స్థానిక కోర్టులో(అసోం) క్రిమినల్‌ పరువు నష్టం దావా కేసు వేశారు. ఆ కేసును కొట్టేయాలంటూ గువాహతి హైకోర్టులో సిసోడియా ఒక పిటిషన్‌ దాఖలు చేయగా.. నవంబర్‌ 4వ తేదీన కోర్టు సిసోడియా పిటిషన్‌ను తిరస్కరించింది. ఆప్‌ నేత ఎక్కడా కూడా డబ్బులు తీసుకున్నట్లు పేర్కొనలేదని సుప్రీంలో సీనియర్‌ న్యాయవాది సింఘ్వీ పేర్కొన్నారు. అయితే చర్చను ఈ స్థాయికి తగ్గిస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కోర్టు మందలించడంతో పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారాయన. 

మరిన్ని వార్తలు