కేంద్రమంత్రిపై మన్మోహన్‌ సింగ్‌ కుమార్తె ఆగ్రహం..‘వాళ్లేం జూలో జంతువులు కాదు’

16 Oct, 2021 17:51 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంపై అభ్యంతరం తెలియజేశారు. తన తల్లిదండ్రులు వృద్ధులని, జూ లో జంతులు కాదని మండిపడ్డారు. కాగా డెంగ్యూ వ్యాధికి గురైన మన్మోహన్‌ సింగ్‌ రెండు రోజులుగా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. 
చదవండి: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత

ఈ క్రమంలో కేంద్రమంత్రి మన్సుఖ్‌ మాండవీయ శుక్రవారం ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)వెళ్లి మాజీ ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. అక్కడే ఉన్న మన్మోహన్‌ సింగ్‌ సతీమణి గురుశరన్‌ కౌర్‌ను కలిసి మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫొటోల్లో మన్మోహన్ సింగ్ మంచం మీద పడుకుని ఉండగా.. ఆయన భార్య పక్కన నిలబడి ఉన్నారు.

అయితే కేంద్రమంత్రి తీరుపై మన్మోహన్‌ సింగ్‌ కుమార్తె దమన్‌ సింగ్‌ ఫైర్‌ అయ్యారు. మంత్రి తనతోపాటు ఫోటోగ్రాఫర్‌ను గదిలోకి తీసుకొచ్చినప్పుడు తల్లి చాలా బాధపడిందని, బయటకు వెళ్లాలని చెప్పిన ఆమె మాటలు అస్సులు వినిపించుకోలేదని అన్నారు. తమ తల్లిదండ్రుల కోరికకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు అసహనం వ్యక్తం చేశారు. ‘ఆరోగ్య మంత్రి మా కుటుంబాన్ని పరామర్శించడం సంతోషంగా ఉంది. అయితే ఆ సమయంలో మా తల్లిదండ్రులు ఫోటో దిగే స్థితిలో లేరు. నా తల్లిదండ్రులు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వారు వృద్ధులు. జూలో జంతువులు కాదు. అని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు