Mann Ki Baat: ‘ఎమర్జెన్సీ’లో ప్రజాస్వామ్యాన్ని అణచే యత్నం

27 Jun, 2022 05:10 IST|Sakshi

మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : దేశంలో 1975లో అత్యవసర పరిస్థితులు విధించి ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ప్రయత్నాలు జరిగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. కాంగ్రెస్‌ నియంతృత్వ పోకడల్ని ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా తిప్పికొట్టారని ప్రపంచంలో మరెక్కడా ఇది కనిపించదని అన్నారు. భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఆదివారం మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో మరోసారి ప్రధాని మోదీ కాంగ్రెస్‌ని లక్ష్యంగా చేసుకొని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

1975 జూన్‌ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. తిరిగి 1977 మార్చి 21న ఎత్తివేశారు. ఎమర్జెన్సీకి  47 ఏళ్లయిన సందర్భంగా ప్రధాని దాని గురించి ప్రస్తావిస్తూ ఆ చీకటి రోజుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ జీవించే హక్కుని హరించివేసిందని, అన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని ప్రభుత్వ తొక్కి పెట్టి ఉంచిందని అప్పటి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.   చివరికి గాయకుడు కిశోర్‌ కుమార్‌ కూడా ఎమర్జెన్సీ చేదు అనుభవాలు ఎదుర్కొ న్నారని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం భారత్‌ అంతరిక్ష రంగంలో చేస్తున్న ప్రయోగాలను ప్రధాని ప్రశంసించారు.  

ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ: ఏచూరి
ప్రధాని మోదీ ఎమర్జెన్సీ వ్యాఖ్యల్ని సీపీఎం నేత సీతారాం ఏచూరి తిప్పికొట్టారు. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉందని అప్పట్లో మాదిరిగానే ప్రజలు దీనిని కూడా ఓడిస్తారని జోస్యం పలికారు.

మరిన్ని వార్తలు