మోదీ ‘మనసులో మాట’కు కోట్లకు కోట్లు

19 Jul, 2021 21:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదే నరేంద్ర మోదీ ఆదరణ కోల్పోతున్న ఆలిండియా రేడియో, దూరదర్శన్‌​పై దృష్టి సారించారు. మారుతున్న ప్రజల అభిరుచులకు తగ్గట్టు అభివృద్ధి చెందని ఆలిండియా రేడియో, దూరదర్శన్‌పై మోదీ తీసుకున్న నిర్ణయంతో పూర్వ వైభవం వచ్చింది. ఇప్పుడు మన దేశ రేడియో, దూరదర్శన్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రధానమంత్రి ‘మనసులో మాట (మన్‌ కీ బాత్‌)’ కార్యక్రమంతో కోట్లు వస్తున్నాయి. మూసివేతకు గురవుతుందని భావించిన ఆయా సంస్థలు ఇప్పుడు లాభాల బాట పట్టింది కూడా.

2014లో ‘మనసులో మాట (మన్‌ కీ బాత్‌)’ అనే కార్యక్రమాన్ని ఆలిండియా రేడియో, దూరదర్శన్‌లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసుకు నచ్చిన అంశంపై మాట్లాడుతారు. అలా ఇప్పటివరకు 78 ఎపిసోడ్లు ప్రధాని మన్‌ కీ బాత్‌ చేశారు. ఈ కార్యక్రమంతో ఇప్పటివరకు రూ.30.80 కోట్ల ఆదాయం వచ్చిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని సోమవారం ప్రారంభమైన వర్షాకాల సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. ఏ సంవత్సరం ఎంత ఆదాయం వచ్చిందో వివరంగా సభకు తెలిపింది.

సంవత్సరం    ఆదాయం
2014-15 రూ.1.6 కోట్లు
2015-16 రూ.2.81 కోట్లు
2016-17 రూ.5.14 కోట్లు
2017-18 రూ.10.64 కోట్లు
2018-19 రూ.7.47 కోట్లు
2019-20 రూ.2.56 కోట్లు
2020-21 రూ.1.02 కోట్లు

ఈ మన్‌ కీ బాత్‌ ఆలిండియా రేడియోలోనే అంత్యత ప్రజాదరణ పొందిన కార్యక్రమంగా ప్రభుత్వం రాజ్యసభలో తెలిపింది. ప్రధానమంత్రి ప్రసంగంతో దూరదర్శన్‌ వీక్షకుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని గణాంకాలతో సహా వివరించింది. బ్రాడ్‌కాస్ట్‌ ఆడియెన్స్‌ రీసర్చ్‌ కౌన్సిల్‌ (బార్క్‌) వివరాల ప్రకారం.. 6 కోట్ల నుంచి ఏకంగా 14.35 కోట్ల మంది వీక్షకులు పెరిగారని వెల్లడించింది. మారుమూల గ్రామాలకు సైతం ప్రధాని ప్రసంగం చేరిందని పేర్కొంది. అయితే ఈ ‘మనసులో మాట’ కార్యక్రమానికి ప్రధాని మోదీ ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించారు. తాను ఏ అంశంపై మాట్లాడాలో చెప్పాలని అప్పుడప్పుడు ప్రజలను అడుగుతుంటారు. ఈ కార్యక్రమంతో ప్రసార భారతి (ఆలిండియో రేడియో), దూరదర్శన్‌కు పూర్వ వైభవం వచ్చింది. ఆలిండియో రేడియోను దేశ రేడియోగా, దూరదర్శన్‌ను మన దేశ టీవీగా పేర్కొంటారు. మన దేశ అధికారిక ప్రసార మాధ్యమాలు ఆ రెండూ అనే విషయం అందరికీ తెలిసిందే.

మరిన్ని వార్తలు