మన ఎగుమతులు భేష్‌

28 Mar, 2022 05:54 IST|Sakshi

400 బిలియన్‌ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించాం

స్వదేశీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ 

ప్రతి జిల్లాలో కనీసం 75 అమృత్‌ సరోవరాలు నిర్మించుకోవాలి

‘మన్‌ కీ బాత్‌’లో నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ/సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్‌ డాలర్ల (రూ.30 లక్షల కోట్లు) విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని భారత్‌ సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మన ఉత్పత్తులకు ప్రపంచమంతటా డిమాండ్‌ పెరుగుతోందనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ వస్తువుల కోసం దేశాలు ఎదురు చూస్తున్నాయని, మన సప్లై చైన్‌ రోజురోజుకూ మరింత శక్తివంతంగా మారుతోందని అన్నారు. ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ నినాదాన్ని ప్రతి భారతీయుడు అందిపుచ్చుకుంటే లోకల్‌ గ్లోబల్‌గా మారడానికి ఎక్కువ సమయం పట్టదని చెప్పారు.

ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’లో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఏడాదిగా ప్రభుత్వం ఈ–మార్కెట్‌ ద్వారా రూ.లక్ష కోట్లకుపైగా విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేసిందన్నారు. 1.25 లక్షల మంది చిన్నతరహా వ్యాపారవేత్తలు, దుకాణదారులు తమ ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వానికి విక్రయించారని తెలిపారు. గతంలో బడా వ్యాపారులే ప్రభుత్వానికి సరుకులను విక్రయించే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు చిన్న వ్యాపారులు, దుకాణదారులకు కూడా ఆ అవకాశం లభిస్తోందని వెల్లడించారు. భారతీయులంతా చేతులు కలిపితే ఆత్మనిర్భర్‌భారత్‌ లక్ష్యసాధన సులువేనన్నారు.

ఆయుష్‌కు అద్భుత అవకాశాలు
ఆయుష్‌ ఉత్పత్తులకు మార్కెట్‌ విస్తరిస్తుండడం సంతోషకరమని మోదీ చెప్పారు. ఈ రంగంలో స్టార్టప్‌లకు అద్భుత అవకాశాలు ఉన్నాయన్నారు. ఆయుష్‌ పరిశ్రమ మార్కెట్‌ విలువ రూ.22,000 కోట్ల నుంచి రూ.1.4 లక్షల కోట్లకు చేరిందన్నారు. మన ఉత్పత్తుల ప్రతిష్టను, గిరాకీని మరింత పెంచుకొనేలా కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు. 126 ఏళ్ల వయసులో పద్మశ్రీ అందుకున్న యోగా గురువు స్వామి శివానంద జీవితం నుంచి దేశం ఎంతో స్ఫూర్తిని పొందుతోందని మోదీ అన్నారు. ప్రతి చుక్కనూ ఆదా చేసుకోవాలన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ప్రతి జిల్లాలో 75 అమృత్‌ సరోవరాలు నిర్మించుకోవాలన్నారు.

ఏప్రిల్‌ 1న పరీక్షా పే చర్చ
ఏప్రిల్‌ 1న ఢిల్లీ తల్కటోరా స్టేడియంలో ‘పరీక్షా పే చర్చ’లో మోదీ విద్యార్థులతో స్వయంగా మాట్లాడనున్నారు. పరీక్షల పండుగ జరుపుకుందామంటూ విద్యార్థులకు పిలుపునిచ్చారు.

సికింద్రాబాద్‌ మెట్ల బావి ప్రస్తావన
తెలంగాణలోని సికింద్రాబాద్‌లో ఇటీవల బయటపడిన మెట్ల బావి గురించి మన్‌కీ బాత్‌లో ప్రధాని ప్రస్తావించారు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన మెట్లబావి పునరుద్ధరణకు ప్రజలు చూపిన చొరవను అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, చిత్తూరు జిల్లాల నుంచి బంగినపల్లి, సువర్ణరేఖ మామిడి పండ్లు దక్షిణ కొరియాకు కూడా ఎగుమతి అవుతున్నాయంటూ ఆయన ప్రశంసించారు.

మరిన్ని వార్తలు