మారియప్పన్‌కు ప్రధాని ప్రశంసలు

27 Oct, 2020 06:41 IST|Sakshi
సెలూన్‌లోని గ్రంథాలయంలో పొన్‌ మారియప్పన్‌  

క్షవరశాలను గ్రంథాలయంగా తీర్చిదిద్దడంపై ప్రశంసల జల్లు

సాక్షి, చెన్నై: పదో తరగతి కూడా చదవలేదు. బతుకు బండి లాగేందుకు అతను చేసేది క్షవరవృత్తి. అయితేనేం ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ అతడితో సంభాషించారు. ప్రశంసల వర్షం కురిపించారు. అతని జీవితంలోని భిన్నమైన కోణానికి మరింత స్పూర్తి నింపారు. వివరాల్లోకి వెళితే... తూత్తుకూడికి చెందిన పొన్‌ మారియప్పన్‌ జీవనోపాధి కోసం మిల్లర్‌పురంలో సెలూన్‌ ప్రారంభించాడు. కానీ లోలోపలే ఉన్నతవిద్య చదువుకోలేదనే అంతర్మధనంతో సతమతమయ్యేవాడు. చదువంటే పాఠ్యపుస్తకాలే కాదు లోకజ్ఞానం కూడా అని భావించాడు. పుస్తకాలు చదవడం ప్రారంభించాడు. తనలాంటి వారి కోసం తన సెలూన్‌ను ఒక గ్రంథాలయంగా మార్చేశాడు. ఈ ప్రయత్నం స్థానికులనే కాదు ప్రధాని నరేంద్రమోదీనే ఆకర్షించింది. “మన్‌కీ బాత్‌’ కార్యక్రమంలో మారియప్పన్‌తో ఇటీవల పధాని మోదీ సంభాషించి మెచ్చుకోవడంతో అతని ఆనందానికి హద్దులేకుండా పోయింది. ఈ ఆనందానుభూతి అతడి మాటల్లోనే... 

‘తూత్తుకూడి ఆలిండియా రేడియో స్టేషన్‌ వారు ఒక రోజు నన్ను అకస్మాత్తుగా తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. నా గురించి అప్పటికే అందరికీ తెలిసి ఉండడంతో అరుదైన పుస్తకాలు ఇస్తారేమోననే ఆలోచనతో వెళ్లాను. అయితే రేడియో స్టేషన్‌ ఉన్నతాధికారులు నా వద్దకు వచ్చి ప్రధాని మోదీ మీతో మాట్లాడుతారని చెప్పడంతో బిత్తరపోయాను. మన్‌కీ బాత్‌ ద్వారా ప్రధాని మోదీ ముందుగా నా క్షేమ సమాచారాలు తమిళంలోనే అడిగి తెలసుకుని సంభాషించడంతో ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. సెలూన్‌ను పుస్తకాలతో గ్రంథాలయంగా మార్చడం ద్వారా ఇప్పటికే అనేక అవార్డులు అందుకున్నాను. అయితే ప్రధానితో మాట్లాడిన తరువాత ఇంకా ఎంతో సాధించాలనే తపన పెరిగింది. నీకు బాగా నచ్చిన గ్రంథం ఏదని మోదీ అడిగినప్పుడు తిరుక్కురల్‌ అని చెప్పాను.  (విషమంగా వ్యవసాయశాఖ మంత్రి ఆరోగ్యం)

8వ తరగతితో చదువు మానేసి 2014లో సెలూన్‌ను ప్రారంభించాను. పుస్తక పఠనాన్ని పెంచాలనే ఉద్దేశంతో 2015లో సెలూన్‌లో గ్రంథాలయం పెట్టాను. గ్రంథాల్లోని ముఖ్యమైన అంశాలను వివరిస్తూ హెయిర్‌ కటింగ్, షేవింగ్‌ చేయడం ద్వారా పలు సామాజిక విషయాలపై ఎంతో మందిలో చైతన్యం తీసుకొచ్చాను. ప్రస్తుతం నా గ్రంథాలయంలో 1,500లకు పైగా పుస్తకాలున్నాయి. సెలూన్‌కు వచ్చే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగంగా మారింది. విద్యార్థులకు రాయితీపై సెలూన్‌ సేవలు అందిస్తున్నాను. నాకు అమ్మ, నాన్న, భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఉమ్మడి కుటుంబంగా అందరం ఒకే చోట ఉంటాం. నేను చేసిన ఒక సాధారణ ప్రయత్నానికి ప్రధాని ప్రశంస లభించడం ఎంతో ఆనందంగా ఉందని’ తెలిపాడు.   

>
మరిన్ని వార్తలు