Mann Ki Baat: మన స్టార్టప్‌లు సూపర్‌

30 May, 2022 04:01 IST|Sakshi

మన్‌ కీ బాత్‌లో మోదీ

వాటితో ఎనలేని సంపద సృష్టి

చిన్న పట్టణాల నుంచీ మెరికలు

చూస్తుండగానే 100 యూనికార్న్‌లు

వైవిధ్యమే మన బలమన్న ప్రధాని

న్యూఢిల్లీ: భారత స్టార్టప్‌ కంపెనీలు కరోనా కష్టకాలంలోనూ ఎనలేని సంపదను, విలువను సృష్టించాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘వీటివల్ల చిన్న పట్టణాల నుంచి కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వెలుగులోకి వస్తున్నారు. వినూత్నమైన ఆలోచనలుంటే సంపదను సులువుగా సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు’’ అంటూ కొనియాడారు. ఆదివారం మన్‌ కీ బాత్‌లో ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు.

‘‘భారత క్రికెట్‌ జట్టు బ్యాట్స్‌మన్‌ సెంచరీ చేస్తే మనందరికీ ఎంతో ఆనందం కలుగుతుంది. అలాగే మన దేశం స్టార్టప్‌ల రంగంలో అరుదైన సెంచరీ కొట్టింది. దేశంలో యూనికార్న్‌ (రూ.7,500 కోట్ల కనీస టర్నోవర్‌ ఉన్న స్టార్టప్‌) కంపెనీల సంఖ్య ఈ నెల 5వ తేదీతో 100కు చేరింది. ఇదో గొప్ప మైలురాయి. వీటి సమష్టి విలువ 330 బిలియన్‌ డాలర్ల కంటే కూడా ఎక్కువ! అంటే, రూ.25 లక్షల కోట్ల పై చిలుకు!! ప్రతి భారతీయునికీ గర్వకారణమిది’’ అన్నారు. ‘‘వీటిల్లో 44 యూనికార్న్‌లు గతేడాదే వచ్చాయంటే ఆశ్చర్యం కలక్కమానదు.

ఈ ఏడాది తొలి 4 నెలల్లోనే 14కు పైగా యూనికార్న్‌లు ఆవిర్భవించాయి. వచ్చే కొన్నేళ్లలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. భారత యూనికార్న్‌ల సగటు వార్సిక వృద్ధి రేటు అమెరికా, ఇంగ్లండ్‌తో సహా అత్యధిక దేశాల కంటే ఎక్కవ. పైగా మన యూనికార్న్‌లు ఈ కామర్స్, ఫిన్‌ టెక్, ఎడ్‌ టెక్, బయో టెక్‌ వంటి వైవిధ్య రంగాల్లో విస్తరిస్తుండటం మరింత శుభసూచకం. పైగా స్టార్టప్‌ల ప్రోత్సాహానికి అత్యంత కీలకమైన సమర్థులైన మెంటార్లు విరివిగా అందుబాటులోకి రావడం మరో సానుకూల పరిణామం’’ అన్నారు. వెంబు శ్రీధర్, మదన్‌ పడాకీ, మీరా షెనాయ్‌ తదితరులను ఈ సందర్భంగా ఉదాహరించారు.

మనసుంటే మార్గముంటుంది
మన దేశం విభిన్న భాషలు, యాసలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో సుసంపన్నంగా అలరారుతోందని మోదీ అన్నారు. మన బలానికి, ఐక్యతకు ఈ వైవిధ్యమే మూలమని కొనియాడారు. ‘‘సాధించి తీరాలన్న మనసుంటే మార్గం అదే దొరుకుతుంది. కర్నాటకలో పదో తరగతి పరీక్షల్లో కన్నడ సబ్జెక్టులో 92 మార్కులు సాధించిన కల్పన అనే ఉత్తరాఖండ్‌ అమ్మాయే ఇందుకు ఉదాహరణ. ఆమెకు మూడో తరగతిలోనే టీబీ సోకింది. ఒక కంటి చూపు కూడా పోయింది. పైగా ఇటీవలి దాకా కన్నడ భాష గురించి అసలేమీ తెలియదు. అయినా మైసూరుకు చెందిన ప్రొఫెసర్‌ తారామూర్తి ప్రోత్సాహంతో మూడే నెలల్లో కన్నడపై పట్టు సాధించింది.

రాజ్యాంగాన్ని సంతాలీ భాషలోకి అనువదించిన పశ్చిమబెంగాల్లోని పురులియాకు చెందిన శ్రీపతి తుడు అనే ప్రొఫెసర్‌దీ ఇలాంటి స్ఫూర్తి గాథే. అలాగే తంజావూరు స్వయం సహాయక బృందం కళాకారులు నాకు పంపిన అమ్మవారి కళాకృతి ఓ వెలకట్టలేని బహుమానం. ‘ఏక్‌ భారత్‌–శ్రేష్ఠ్‌ భారత్‌’కు ఇవన్నీ ఉదాహరణలే’’ అన్నారు. స్వయం సహాయక బృందాల ఉత్పత్తులను  వాడటం ద్వారా వాటిని ప్రోత్సహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చార్‌ధామ్‌ యాత్రకు భక్తులు ఈసారి భారీగా పోటెత్తుతుండటం పట్ల హర్షం వెలిబుచ్చారు. కేదార్‌నాథ్‌ క్షేత్రాన్ని చెత్తాచెదారంతో నింపుతుండటం బాధాకరమన్నారు. పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడటం అందరి బాధ్యతన్నారు.

సూర్యోదయాన్ని స్వాగతిస్తూ... ప్రపంచవ్యాప్త రిలే యోగా
ప్రపంచ యోగా డేను ఈ జూన్‌ 21న ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్టు మోదీ ప్రకటించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా ‘మానవాళి కోసం యోగా’ పేరిట దేశవ్యాప్తంగా 75 చోట్ల యోగా డే ఈవెంట్లు జరుగుతాయి. అలాగే గార్డియన్‌ రింగ్‌ పేరిట జూన్‌ 21న రోజు పొడవునా ప్రపంచమంతటా పలు దేశాల్లో సూర్యోదయాన్ని యోగా సాధనతో స్వాగతించనున్నాం. ఇది ఒకరకంగా రిలే యోగా ఈవెంట్‌గా సాగుతుంది. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు వీటిని చేపడతాయి’’ అని వివరించారు.

‘దేశం, జాతి తదితరాలతో సంబంధం లేకుండా యోగాతో ఎందరో శారీరక, మానసిక, మేధోపరమైన, ఆధ్యాత్మిక ఆరోగ్యాలను సొంతం చేసుకుంటున్నారన్నారు. జపనీయుల్లో భారత్‌ పట్ల ఉన్న ప్రేమను ఇటీవల ఆ దేశంలో పర్యటన సందర్భంగా సన్నిహితంగా గమనించానని మోదీ చెప్పారు. జపాన్‌కు చెందిన ప్రఖ్యాత కళా దర్శకుడు హిరోషీ కొయిటే తొమ్మిదేళ్లుగా మహాభారత్‌ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నట్టు, నాటక ప్రదర్శనలు ఇస్తున్నట్టు తెలిసి ఎంతో సంతోషించా. మరో ఇద్దరు జపనీయులు రామాయణంపై జపనీస్‌లో యానిమేషన్‌ ఫిల్మ్‌ రూపొందించారు’’ అని వివరించారు.

మరిన్ని వార్తలు