త్వరలో అందుబాటులోకి మరో దేశీ వ్యాక్సిన్‌

6 Aug, 2021 16:46 IST|Sakshi
బయోలాజికల్‌ ఈ కంపెనీ (ఫైల్‌ఫోటో)

కేంద్ర ఆరోగ్య మంత్రిని కలిసిన బయోలాజికల్‌-ఈ ఎండీ మహిమా దాట్ల

ఇప్పిటికే బయోలాజికల్‌ కంపెనీకి రూ. 1500 కోట్లు చెల్లించిన కేంద్రం

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ కట్టడికి ఇప్పటికే కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ టీకాలను పంపిణీ చేస్తుండగా.. త్వరలో మరో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. అది కూడా హైదరాబాద్‌కు చెందిన ఫార్మ కంపెనీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ కావడం విశేషం. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండవియా శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ బయోలాజికల్‌-ఈ ఎండీ మహిమా దాట్లతో భేటీ అయ్యారు. తమ కంపెనీ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ కోర్బివాక్స్‌ పురోగతి గురించి మహిమా దాట్ల.. మంత్రికి వివరించారు.

కోర్బివాక్స్‌ టీకా తయారీకి ప్రభుత్వం మద్దతిస్తుందని కేంద్రమంత్రి.. బయోలాజికల్‌-ఈ ఎండీకి హామీ ఇచ్చారు. ఈ మేరకు మన్సుక్‌ మాండవియా శుక్రవారం ట్వీట్‌ చేశారు. ఇప్పటికే బయోలాజికల్‌-ఈ కంపెనీకి కేంద్రం 1500 కోట్ల రూపాయలు చెల్లించింది. 

ఈ సందర్భంగా బయోలాజికల్‌-ఈ ఎండీ మహిమా దాట్ల మాట్లాడుతూ.. ‘‘మా వ్యాక్సిన్‌ ఉత్పత్తికి సాయం చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈనెల నుంచే కోర్బివ్యాక్స్‌ ఉత్పత్తి ప్రారంభిస్తాం. డిసెంబర్‌లోగా కేంద్రానికి 30 కోట్ల వ్యాక్సిన్లు అందజేస్తాం’’ అని తెలిపారు.
 

మరిన్ని వార్తలు