‘నేను ఆరోగ్య మంత్రిని..’ కాంగ్రెస్‌ విమర్శలపై మాండవియా కౌంటర్‌

22 Dec, 2022 17:38 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో భారత్‌ జోడో యాత్రలో మార్గదర్శకాలు పాటించాలని, లేదంటే యాత్రను ఆపాలని కోరుతూ రాహుల్‌ గాంధీకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్‌ మాండవియా లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆయన లేఖపై రాహుల్‌ గాంధీతో పాటు కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర విమర్శలు చేశాయి. యాత్రను ఆపాలని చేస్తున్న రాజకీయ కుట్రగా పేర్కొన్నాయి. తాజాగా కాంగ్రెస్‌ విమర్శలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు కేంద్ర మంత్రి మాన్సుఖ్‌ మాండవియా. భారత్‌ జోడో యాత్ర సందర్భంగా కోవిడ్‌ మార్గదర్శకాలు పాటించాలని రాహుల్‌ గాంధీ, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లట్‌ను కోరుతూ లేఖ రాయడం రాజకీయం కాదని నొక్కి చెప్పారు. 

‘ఇది ఏ మాత్రం రాజకీయ కాదు. నేను ఆరోగ్య మంత్రిని, ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కోవిడ్ నియమాలను అనుసరించాల్సిన అవసరం, ఆ ప్రక్రియలోని పురోగతిని నేను ఎల్లప్పుడూ పర్యవేక్షించాలి. కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ముగ్గురు ఎంపీలు నాకు లేఖ రాశారు. భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్న తర్వాత హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు వంటి కాంగ్రెస్‌ నేతలు కరోనా బారినపడ్డారు.’ అని పేర్కొన్నారు ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్‌ మాండవియా. 

అంతకు ముందు కేంద్ర మంత్రి లేఖపై మండిపడ్డారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. భారత్‌ జోడో యాత్రను ఆపేందుకు కరోనాను ఒక సాకుగా చూపుతున్నారని, అది బీజేపీ కొత్త పన్నాగమని విమర్శించారు. మరోవైపు.. యాత్రను అడ్డుకునేందుకు ఆకస్మికంగా కరోనా చర్యలను తెరపైకి తెచ్చారని విమర్శించారు కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌. ప్రస్తుతం కేంద్రం లేఖపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

ఇదీ చదవండి: చైనా పరిస్థితి ఒక హెచ్చరిక.. కరోనాపై లోక్‌సభలో ఆరోగ్య మంత్రి కీలక ప్రకటన

మరిన్ని వార్తలు