హథ్రాస్‌ రేప్‌ కేసులో అనుమానాలెన్నో!

4 Oct, 2020 15:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్‌ దళిత యువతి దారుణ హత్యా, అత్యాచారం కేసులో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఠాకూర్‌ కుటుంబానికి చెందిన నలుగురు యువకులు దారుణంగా దాడి చేయడం వల్ల దళిత యువతి మరణించినట్లు తెలుస్తోంది గానీ, వారి వల్ల అత్యాచారానికి గురైనట్లు ఆధారాలు లేవని, ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబరేటరీ నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర అదనపు డీజీపీ ప్రశాంత కుమార్‌ గత గురువారం మీడియాకు వెల్లడించడం పలు అనుమానాలకు దారి తీసింది. పోలీసులే ఈ కేసును మసిపూసి మారేడు కాయను చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, బాధితురాలి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా బుధవారం తెల్లవారు జామున 3.30 గంటలకు పోలీసులే తగులబెట్టడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. 

సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం రేప్‌ కేసుల్లో బాధితుల మృతదేహాలను తప్పనిసరిగా కుటుంబసభ్యులకే అప్పగించాలి. అలా చేయకపోగా కూతురు మృతదేహాన్ని కోరడానికి వెళితే పోలీసులు తమను నిర్బంధించి వేధించారని బాధితురాలి తల్లి, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్‌ 14వ తేదీన దుండగుల దాడికి, అత్యాచారానికి గురైన దళిత యువతి ఆలీగఢ్‌ ఆస్పత్రిలో చేరిన ప్పుడు మీడియా ముఖంగా ఆమె తనపై అత్యాచారం జరిగినట్లు ఆరోపించారు. బాధితురాలిని రేప్‌ చేశారని చెప్పడానికి ఆ ఆస్పత్రి వైద్య నిపుణులు ‘కంప్లీట్‌ పెనట్రేషన్‌ ఆఫ్‌ వజీనా’ అంటూ తమ ప్రాథమిక నివేదికలో వెల్లడించారు. సెప్టెంబర్‌ 29వ తేదీన ఢిల్లీ ఆస్పత్రిలో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో మరణించిన తర్వాత నిర్వహించిన ‘ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌’ నివేదికలో ‘వీర్యం’ ఆనవాళ్లు కనిపించలేదని ఇచ్చారు. ఇదే విషయాన్ని యూపీ అదనపు డీజీపీ మీడియా ముఖంగా వెల్లడించారు. (చదవండి : హథ్రాస్ ఘటన‌: న్యాయం చేసే ఉద్దేశముందా?)

బాధితురాలపై సెప్టెంబర్‌ 14వ తేదీన అత్యాచారంరిగినందున వాటి ఆనవాళ్లు సెప్టెంబర్‌ 29వ తేదీ వరకు ఉండే అవకాశం లేదని అలీగఢ్‌ ఆస్పత్రి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అత్యాచారం జరిగిన చాలా రోజుల వరకు పోలీసులు కేసు దాఖలు చేయక పోవడం, కనీసం నిందితులను అదుపులోకి తీసుకోక పోవడం కూడా పలు అనుమానాలకు దారితీసింది. ఈ కేసు విచారణను మొదట సిట్‌ దర్యాప్తునకు అప్పగించిన ఆదిత్యనాథ్‌ యోగి ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ఒత్తిడి మేరకు సీబీఐకి అప్పగించింది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సీబీఐ వల్ల న్యాయం జరగక పోవచ్చని కాంగ్రెస్, దళిత పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్‌కౌంటర్లకు పెట్టింది పేరైన యూపీ పోలీసులు హైదరాబాద్‌లోని ప్రియాంక రెడ్డి హత్యా, అత్యాచారం కేసులో లాగా ఈ కేసులో నేరస్థులను ఎందుకు ఎన్‌కౌంటర్‌ చేయరని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. (చదవండి : దళిత యువతి వీడియో క్లిప్‌పై హల్‌చల్‌)

మరిన్ని వార్తలు