సుశాంత్‌ ఆత్మహత్య లాంటివి పునరావృతం కాకూడదంటే

10 Oct, 2020 18:18 IST|Sakshi

నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్‌ 14న ఆత్మహత్య చేసుకోవడంతో ప్రజల మానసిక ఆరోగ్యం గురించి మరోసారి జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. సుశాంత్‌ సింగ్‌ మరణంలో కుట్ర కోణం గురించే ఎక్కువ చర్చ జరిపారు అది వేరే విషయం. ప్రపంచ ఆరోగ్యం సంస్థ ‘మంచి ఆరోగ్యం’కు ఇచ్చిన నిర్వచనం ప్రకారం ప్రజలు శారీరకంగానే కాకుండా మానసికంగా, సామాజికంగా మంచిగా ఉండడం. అందుకేనేమో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజల మానసిక ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చే ‘ప్రోగ్రెసివ్‌ మెంటల్‌ హెల్త్‌ కేర్‌ యాక్ట్‌’ తీసుకొచ్చింది. అందులోని కొన్ని నిబంధనలు ఇప్పటికీ అమలు కావాల్సి ఉంది. ‘లాన్‌సెట్‌ సైకియాట్రి’ 2017లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం భారతీయ ప్రజల్లో 14.3 శాతం మంది, అంటే 19.73 కోట్ల మంది ప్రజలు మానసిక అనారోగ్యంతో బాధ పడుతున్నారు. కాగా నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం (అక్టోంబర్‌ 10). చదవండి: మానసిక ఆరోగ్యంలో మార్పులు

‘నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో’ ప్రకారం 2019 సంవత్సరంలో 1,39,123 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే దేశంలో ఆత్మహత్యలు 3.4 శాతం ఎక్కువ. ‘ప్రోగ్రెసివ్‌ మెంటల్‌ హెల్త్‌ కేర్‌ యాక్ట్‌’ రావడంతో ఈ ఆత్మహత్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని భావించాం. 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఆమోదించిన బడ్జెట్‌లో గతేడాదిలాగే ‘నేషనల్‌ మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌’కు 40 కోట్ల రూపాయలను కేటాయించారు. వాస్తవానికి బెంగళూరులోని ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌’కు గత కన్నా నిధుల కేటాయింపుల్లో కోత విధించారు. దేశ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది కనుక ఆరోగ్య రంగానికి ఎక్కువ స్థాయిలో నిధులను కేటాయించలేదని భావించవచ్చు. చదవండి: మానసిక ఆరోగ్య ప్రాపిరస్తు..!

‘నేషనల్‌ ఏడ్స్‌ అండ్‌ ఎస్‌టీడీ కంట్రోల్‌ ప్రోగ్రామ్‌కు ఇదే బడ్జెట్‌లో 2,900 కోట్ల రూపాయలను కేటాయించిన ప్రభుత్వం, ఆఖరికి పొగాకు నియంత్రణకు 40 కోట్ల రూపాయలను కేటాయించి ప్రజల మానసిక ఆరోగ్యానికి అంత ప్రాధాన్యం ఎందుకివ్వలేక పోతున్నారన్నదే ప్రశ్న. మెంటల్‌ హెల్త్‌ కేర్‌ యాక్ట్‌ను అమలు చేయడానికి 94,073 కోట్ల రూపాయలు అవసరమని నిమ్‌హాన్స్‌ వైద్యులు అంచనా వేశారు. మొత్తం హెల్త్‌ కేర్‌ బడ్జెట్‌లో 0.05 శాతం నిధులను మాత్రమే మానసిక ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నారు. అదే అభివద్ధి చెందిన దేశాలు నాలుగు నుంచి ఐదు శాతం ఆరోగ్య రంగం నిధులను మానసిక ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నాయి. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యను తమ రాజకీయాల కోసం ఉపయోగించుకునే భారత రాజకీయవేత్తలకు అలాంటి ఆత్మహత్యలను నిజంగా నిర్మూలిద్దామనే ఆలోచన ఎందుకు కలగదో వారికే తెలియాలి. 

మరిన్ని వార్తలు