వ్యాక్సిన్‌ : లండన్‌కు క్యూ కట్టనున్న ఇండియన్స్‌

3 Dec, 2020 11:29 IST|Sakshi

 ఫైజర్ వ్యాక్సిన్ : బ్రిటన్‌కు క్యూ కట్టనున్న భారతీయులు

వ్యాక్సిన్‌ కోసం లండన్‌ వెళ్లాలనుకుంటున్న వీసాదారులు

క్యాష్‌ చేసుకునేందుకు  సిద్ధమవుతున్న ట్రావెల్ ఏజెన్సీలు

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ను బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించడంతో  భారతీయులు  బ్రిటన్‌ వెళ్లేందుకు క్యూ కడుతున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం బుధవారం ఆమోదించిన కోవిడ్‌-19 ఫైజర్‌ వ్యాక్సిన్‌ కోసం వీలైనంత త్వరగా యూకే వెళ్లాలని భావిస్తున్నారట.చాలామంది వీసాదారులు ట్రావెల్‌ ఏజెంట్లను సంప్రదిస్తున్నారు. ఈ మేరకు తమకు కాల్స్  రావడం ప్రారంభమైందని ట్రావెల్ ఏజంట్లు  చెబుతున్నారు.  అటు ఈ డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు ట్రావెల్ ఏజెన్సీలు కూడా భారీ ప్రణాళికలతో సిద్ధమైపోతున్నాయి.(ఫైజర్‌ టీకా వచ్చేసింది!)

వచ్చే వారం నుంచే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎపుడు, ఎలా వెళ్లాలి, ఐసోలేషన్‌ నిబంధనలు ఏమిటి అంటూ చాలామంది  తమను ప్రశ్నిస్తున్నారని  ముంబైకి చెందిన ట్రావెల్‌ ఏజెంట్‌ తెలిపారు. క్వారంటైన్ లేకుండా లండన్‌కు షార్ట్ ట్రిప్ ఏదైనా ఉందా అని కొంతమంది వాకబు చేసినట్టు బెంగుళూరుకు చెందిన మరో  ట్రావెల్ కంపెనీ తెలిపింది. లండన్ వెళ్లే  భారతీయులకోసం మూడు రాత్రుల ప్యాకేజీని ప్రారంభించాలని యోచనలో ఉన్నాయి కంపెనీలు. ఈ నెల(డిసెంబరు) 15 నుంచి తమ దేశంలో అడుగుపెట్టే ప్రతి విదేశీయుడూ 5 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని, ఆరో రోజున ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని బ్రిటన్ కఠిన ఆంక్షలు విధించింది. (పిజ్జా హట్‌ కో ఫౌండర్‌ ఇక లేరు)

లండన్ పర్యటనకు ఇది ఆఫ్‌బీట్ సీజన్ అయినప్పటికీ ఫైజర్ వ్యాక్సిన్ గురించి బుధవారం ప్రకటించిన మరుక్షణం, యూకే వీసాలున్న భారతీయులు వాక్సిన్‌ లభ్యతపై ఎంక్వైరీ మొదలు పెట్టారని  ఈజ్ మై ట్రిప్ డాట్ కామ్ సీఈఓ నిషాంత్  వెల్లడించారు. అయితే భారతీయ పాస్ పోర్టు హోల్డర్లు అక్కడ వ్యాక్సినేషన్‌కు అర్హులా కారా అన్నది ఇపుడే తేల్చలేమన్నారు. దీనిపై ప్రభుత్వం నుండి స్పష్టత కోసం వేచి చూస్తున్నా మన్నారు. మరోవైపు విమాన టికెట్ల రేట్ల విషయమై వివిధ విమానయాన సంస్థలను సంప్రదిస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే లండన్ హోటళ్లతో, అక్కడి ఆసుపత్రులతో కూడా  సంప్రదింపులు జరుపు తున్నామని, ఇప్పటికే లండన్ హోటళ్ళతో ఒప్పందాలున్నాయని వెల్లడించారు. అయితే ఆ దేశం నుంచి అధికారికంగా తమకు సమాచారం లభించాల్సి ఉందని మరికొందరు ట్రావెల్ ఏజంట్లు చెబుతున్నారు.

అయితే ఫైజర్ వ్యాక్సిన్  ప్రభావం, సమర్థతను తెలుసుకోవాలనుకుంటున్న ప్రజలు వేచి చూసే ధోరణిలో ఉన్నారని  ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు జ్యోతి మాయల్ చెప్పారు. సైడ్ ఎఫెక్ట్స్ పై కూడా కొందరు భయపడుతున్నట్టు తెలుస్తోంది. కాగా కరోనా తొలి వ్యాక్సిన్‌ ఆమోదించిన తొలి దేశంగా యూకే నిలిచింది. ఫైజర్, బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌ ప్రయోగాల ఫలితాల ఆధారంగా అక్కడి స్వతంత్ర రెగ్యులేటర్ మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఏ) ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం వ్యాక్సిన్‌ పంపిణీకి అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు