అన్‌లాక్‌ ప్రకటనతో గందరగోళం 

5 Jun, 2021 00:41 IST|Sakshi

అన్‌లాక్‌ ప్రక్రియ మొదలవుతుందన్న మంత్రి వడెట్టివార్‌ 

అదేంలేదు, లాక్‌డౌన్‌ కొనసాగుతుందన్న సీఎంవో 

సీఎంకు, మంత్రులకు సమన్వయం లేదని మండిపడ్డ ప్రతిపక్షాలు 

మంత్రి మర్చిపోయినందుకే గందరగోళమన్న అజిత్‌పవార్‌ 

సాక్షి, ముంబై: రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్‌ విస్తృతి తగ్గుతున్న నేపథ్యంలో అన్‌లాక్‌ ప్రక్రియను ఐదు దశల్లో అమలు చేయనున్నట్లు రాష్ట్ర సహాయ, పునరావాస శాఖ మంత్రి విజయ్‌ వడెట్టివార్‌ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, మంత్రి చేసిన ఈ ప్రకటన గందరగోళానికి కారణమైంది. ఆయన ఆ ప్రకటన చేసిన రెండు గంటల్లోనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మరో ప్రకటన వెలువడింది. అన్‌లాక్‌ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, లాక్‌డౌన్‌ ఇంకా కొనసాగుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ఇలా ప్రభుత్వం నుంచి వేర్వేరు ప్రకటనలు రావడంతో ప్రతిపక్షాలు ఘాటుగా స్పందించాయి.

ముఖ్యమంత్రికి, మంత్రులతో సమన్వయం కొరవడిందని, అందుకే ఎవరికి ఇష్టమున్నట్లు వారు ప్రకటనలు చేస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ప్రవీణ్‌ దరేకర్‌ ట్విట్టర్‌లో దుమ్మెత్తిపోశారు. దీంతో తేరుకున్న రాష్ట్ర సహాయ, పునరావాస శాఖ మంత్రి విజయ్‌ వడెట్టివార్‌ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే ఈ ప్రకటన యావత్‌ రాష్ట్ర ప్రజల చెంతకు చేరిపోవడంతో గందరగోళం మొదలైంది. ముఖ్యంగా శుక్రవారం నుంచి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అన్‌లాక్‌ ప్రకియ అమలు కావాల్సి ఉంది. దీంతో ఆయన చేసిన ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ, అన్‌లాక్‌పై స్పష్టత లేకపోవడంతో వివిధ జిల్లాల యంత్రాంగాలు సంది గ్ధంలో పడిపోయాయి. దీనిపై రాష్ట్ర సహాయ, పునరావాస శాఖ మంత్రి విజయ్‌ వడెట్టివార్‌ మాట్లాడుతూ.. అన్‌లాక్‌ ప్రక్రియను తాత్కాలికంగా ఆమోదించామని తెలిపారు. అయితే, దీనిపై తుది నిర్ణ యం మాత్రం ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేనే తీసుకుంటారని చెప్పారు. ఈ విషయాన్ని గురువారం నాటి విలేకరుల సమావేశంలో చెప్పడం మర్చిపోయానంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

అయితే, అన్‌లాక్‌ ప్రక్రియపై వివాదాస్పద ప్రకటన చేసిన రాష్ట్ర సహాయ, పునరావాస శాఖ మంత్రి విజయ్‌ వడెట్టివార్‌ను ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం పూర్తి సమన్వయంతో పనిచేస్తోందని అజిత్‌ పవార్‌ స్పష్టం చేశారు. ఎన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పడిందనేది ముఖ్యం కాదని, ముఖ్యమంత్రి తీసుకునే అంతిమ నిర్ణయాన్నే అందరూ ఆమోదిస్తారని పేర్కొన్నారు. అన్‌లాక్‌ ప్రకియపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించా రు. లాక్‌డౌన్‌ ఎత్తివేసే ప్రతిపాదనపై ఆలోచిస్తున్నా రని తెలిపారు. కానీ, రాష్ట్ర సహాయ, పునరావాస శాఖ మంత్రి విజయ్‌ వడెట్టివార్‌ ఈ విషయాన్ని చెప్పడం మర్చిపోవడం వల్లే గందరగోళం నెలకొం దని పవార్‌ అభిప్రాయపడ్డారు.

‘కరోనా వైరస్‌ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి స్వయంగా సోషల్‌ మీడియా, టీవీ ద్వారా రాష్ట్ర ప్రజల ముందుకు వస్తున్నారు. అనేక అంశాలపై ప్రజలకు మార్గదర్శనం చేస్తున్నారు. ఆ తరువాత ఆరోగ్య శాఖ మంత్రిగా రాజేశ్‌ తోపే కూడా అనేక అంశాలను సువిస్తారంగా వివరిస్తారు. రాష్ట్ర సహా య, పునరావాస శాఖ మంత్రి విజయ్‌ వడెట్టివార్‌ కూడా మీడియాతో తరచూ మాట్లాడుతారు. ఇదే తరహాలో గురువారం కూడా ఆయన మాట్లాడారు. అయితే కొన్ని జిల్లాలో అన్‌లాక్‌ అమలుచేసే అంశాన్ని వెల్లడిస్తుండగా ఒక వాక్యం చెప్పడం మర్చిపోవడం వల్లే గందరగోళం తలెత్తింది’ అని పవార్‌ పేర్కొన్నారు. ఎవరు ఏం చెప్పినా, ఎలాంటి ప్రకటనలు చేసినా ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే చెప్పిందే తమ ప్రభుత్వ తుది నిర్ణయమవుతుందని ఈ సందర్భంగా అజిత్‌ పవార్‌ స్పష్టం చేశారు.   

మరిన్ని వార్తలు