మరాఠీలో మాట్లాడలేదని 20 గంటలు నిరసన

10 Oct, 2020 08:30 IST|Sakshi

జ్యువెలరీ షాపు ముందు బైఠాయించిన రచయిత శోభా 

మద్దతు తెలిపిన ఎమ్మెన్నెస్‌ కార్యకర్తలు 

ముంబై: మరాఠీ మాట్లాడని ఓ జ్యువెలరీ షాపు యజమానికి వ్యతిరేకంగా ప్రముఖ మరాఠీ రచయిత శోభా దేశ్‌పాండే ఆందోళన నిర్వహించారు. ఆమెకు సంఘీభావంగా రంగంలోకి దిగిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్‌) ఆ షాపు యజమాని క్షమాపణ చెప్పించేలా చేశారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు.. రచయిత శోభా దేశ్‌పాండే గురువారం మధ్యాహ్నం కొలాబాలోని మహావీర్‌ జ్యువెలరీ షాప్‌కి వెళ్లారు. అయితే ఆ షాపులోని వ్యక్తి హిందీలోనే మాట్లాడుతుండటంతో ఆమె మరాఠీలో మాట్లాడమని కోరారు. మరాఠీలో మాట్లాడేందుకు అతడు నిరాకరించాడు. దీంతో మరాఠీలో మాట్లాడాలని పట్టుబట్టడంతో ఆ షాపు యజమాని పోలీసుల సహాయంతో ఆమెను షాపు నుంచి బైటికి పంపించాడు.

దీంతో తనకు అవమానం జరిగిందని భావించిన ఆమె గురువారం మధ్యాహ్నం నుంచి ఆ షాపు ఎదుటే బైఠాయించి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెన్నెస్‌ నాయకు డు సందీప్‌ దేశ్‌పాండే శుక్రవారం ఉదయం అక్కడికి చేరుకుని ఆమెకు మద్దతుగా అక్కడే బైఠాయించారు. సుమారు 20 గంటల ఆందోళన అనంతరం అక్కడికి షాపు యజమానికి చేరుకోవడంతో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం ఏర్పడింది. అనంతరం ఆమెకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెన్నెస్‌ కార్యకర్తలు షాపు యజమానిని డిమాండ్‌ చేశారు. దీంతో షాప్‌ యజమాని శోభా దేశ్‌పాండేకు క్షమాపణ చెప్పాడు. అయితే అప్పటికే తీవ్ర కోపోద్రిక్తుడైన ఎమ్మెన్నెస్‌ కార్యకర్త ఒకరు ఆ షాపు యజమానిపై చేయిచేసుకున్నాడు.

మరిన్ని వార్తలు