Margaret Alva: విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్‌ ఆల్వా

18 Jul, 2022 07:24 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి పదవికి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు మార్గరెట్‌ అల్వా (80) ను బరిలో దించాలని విపక్షాలు నిర్ణయించాయి. ఆదివారం ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ నివాసంలో జరిగిన 17 పార్టీల భేటీలో ఈ మేరకు నిర్ణయించారు. అల్వా పేరును పార్టీలన్నీ ముక్త కంఠంతో ఆమోదించినట్టు భేటీ తర్వాత పవార్‌ తెలిపారు. భేటీకి రాని తృణమూల్‌ కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా మద్దతిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆ పార్టీల చీఫ్‌లు మమతా బెనర్జీ, అర్వింద్‌ కేజ్రివాల్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. జేఎంఎం కూడా అల్వాకే మద్దతిస్తుందని వివరించారు. మల్లికార్జున ఖర్గే, జైరాం రమేశ్‌ (కాంగ్రెస్‌), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), సంజయ్‌ రౌత్‌ (శివసేన), కె.కేశవరావు (టీఆర్‌ఎస్‌), టీఆర్‌ బాలు (డీఎంకే), రాంగోపాల్‌ యాదవ్‌ (ఎస్పీ), వైగో (ఎండీఎంకే), ఏడీ సింగ్‌ (ఆర్జేడీ), మహ్మద్‌బషీర్‌ (ఐఎంయూఎల్‌), జోస్‌ కె.మణి (కేరళ కాంగ్రెస్‌–ఎం) భేటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ భాగస్వామ్య పక్షాలైన శివసేన, జేఎంఎం రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి ముర్ముకు మద్దతు ప్రకటించడం తెలిసిందే.

సుదీర్ఘ రాజకీయ జీవితం 
విపక్షాల నిర్ణయాన్ని సవినయంగా అంగీకరిస్తున్నట్టు అల్వా ట్వీట్‌ చేశారు. తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలన్నారు. ఆమె మంగళవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ను అధికార ఎన్డీఏ తమ అభ్యర్థిగా శనివారం ప్రకటించడం తెలిసిందే. ఎన్నిక ఆగస్ట్‌ 6న జరుగుతుంది. అల్వా ఆమె 1942 ఏప్రిల్‌ 14న కర్ణాటకలోని మంగళూరులో పుట్టారు. విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించారు. కేంద్రంలో పలు మంత్రి పదవులు నిర్వహించడంతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా చేశారు. మరోవైపు, రైతుపుత్రుడైన ధన్‌ఖడ్‌కు మద్దతివ్వాల్సిందిగా విపక్షాలకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విజ్ఞప్తి చేశారు.

ప్రత్యర్థులిద్దరికీ సామ్యాలెన్నో! 
ఉపరాష్ట్రపతి ఎన్నికలో తలపడుతున్న ధన్‌ఖడ్, అల్వా మధ్య ఎన్నో పోలికలున్నాయి. ఇద్దరూ కేంద్ర మంత్రులుగా, గవర్నర్లుగా పని చేశారు. ఇద్దరికీ కాంగ్రెస్‌ నేపథ్యముంది. ఇద్దరూ లా పట్టభద్రులే. ఒక్కసారి మాత్రమే లోక్‌సభకు ఎన్నికయ్యారు. ధన్‌ఖడ్‌ బీజేపీలో చేరకముందు జనతాదళ్, కాంగ్రెస్‌ల్లో పని చేశారు.   

ఇది కూడా చదవండి: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్‌ ధన్‌కర్‌

మరిన్ని వార్తలు