మైనర్‌ హత్యాచారంలో వీడిన మిస్టరీ, చిన్నారిని చిదిమేసింది తల్లి ప్రియుడే!

23 Aug, 2022 10:16 IST|Sakshi

ఢిల్లీ: వివాహేతర సంబంధం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో చిన్నారిపై అపహరించి.. ఆపై కిరాతకంగా ఆమెపై హత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. రాజధానిలో సంచలనం సృష్టించిన మైనర్‌ హత్యాచార కేసులో మిస్టరీ.. రెండు వారాలకు వీడింది. బాధితురాలి తల్లి ప్రియుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనే నిజం విస్మయానికి గురి చేస్తోంది. 

దర్యాగంజ్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భార్య, నలుగురు పిల్లలతో జీవిస్తున్నాడు. ఆగస్టు ఐదవ తేదీ ఉదయం పోలీసులను ఆశ్రయించాడు అతను. తెల్లారి చూసేసరికి తన ఎనిమిదేళ్ల కూతురు కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. దీంతో కిడ్నాప్‌ కేసు నమోదు చేసుకుని.. బాలిక కోసం గాలింపు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే చివరకు ఈ కేసు విషాదంగా ముగిసింది.

ఆగస్టు 18న యమునా ఖాదర్‌ ప్రాంతంలో గాయాలతో గుర్తుపట్టలేని స్థితిలో బాలిక మృతదేహం లభించింది. పోస్ట్‌ మార్టం ప్రకారం.. మైనర్‌పై అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో డీసీసీ శ్వేతా చౌహాన్‌ నేతృత్వంలో యాభై మంది బృందం దర్యాప్తు చేపట్టింది. సీసీ టీవీ ఫుటేజీలోనూ ఫలితం లేకపోవడంతో.. సుమారు 200 మందిని ఇంటరాగేట్‌ చేశారు. ఇదిలా ఉంటే.. మాంసం కొట్టులో పని చేసే రిజ్వాన్‌ అలియాస్‌ బాద్‌షా అనే వ్యక్తి తరచూ బాధిత బాలికకు చాక్లెట్‌ కొనిస్తాడని సమాచారం పోలీసులకు అందింది. 

రిజ్వాన్‌ ఇరవై ఏళ్ల కిందట బీహార్‌ నుంచి ఢిల్లీకి వలస వచ్చాడు. మాంసం దుకాణాల్లో పని చేస్తూ.. మద్యం, గంజాయికి బానిసై తిరుగుతుంటాడు. ఈ క్రమంలో రిజ్వాన్‌ గురించి సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని దొరకబుచ్చుకుని.. తమదైన శైలిలో ప్రశ్నించే సరికి విస్తూపోయే నిజం వెలుగు చూసింది. 

బాధితురాలి తల్లితో రిజ్వాన్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో బాలిక చూడడంతో ఎక్కడ తన తండ్రికి విషయం చెబుతుందో అని ఇద్దరూ భయపడ్డారు. ఆమె అడ్డు తొలగించుకోవాలని యత్నించారని.. ఈ క్రమంలోనే నేరానికి రిజ్వాన్‌ పాల్పడ్డాడని డీసీపీ శ్వేతా చౌహాన్‌ కేసు వివరాలను వెల్లడించారు. నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి.. గంజాయి మత్తులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ​ఇ, ఆపై పదునైన ఆయుధంతో గొంతు కోసి.. ముఖాన్ని చెక్కేశాడని డీసీపీ తెలిపారు. నేరానికి పాల్పడ్డ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

ఇదీ చదవండి: మోడ్రన్‌ రాబిన్‌ హుడ్‌.. దోచుకోవడం-పంచడం!

మరిన్ని వార్తలు