ఢిల్లీ చేరనున్న ‘డ్యాం’ పంచాయితీ..!

5 Jul, 2021 08:01 IST|Sakshi
మంత్రి దురై మురుగన్‌

నేడు ఢిల్లీ వెళ్లనున్న దురై మురుగన్‌ 

రేపు కేంద్ర మంత్రితో భేటీ 

యడ్యూరప్పకు స్టాలిన్‌ లేఖాస్త్రం 

నిర్మాణ ప్రయత్నాలు వీడాలని విజ్ఞప్తి 

సాక్షి, చెన్నై: కావేరి తీరంలోని మేఘదాతు వద్ద కర్ణాటక ప్రభుత్వం నిర్మాణ తలపెట్టిన డ్యాం వ్యవహారం ఢిల్లీకి చేరనుంది. అనుమతులు ఇవ్వొద్దని కేంద్రాన్ని కోరేందుకు రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి దురై మురుగన్‌ ఢిల్లీ ప్రయాణానికి సిద్ధమయ్యారు. డ్యాం నిర్మాణ  ప్రయత్నాలను వీడాలని కర్ణాటక సీఎం యడ్యూరప్పకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌  ఆదివారం లేఖ రాశారు.  

డ్యాం నిర్మాణానికి అడ్డుచొప్పొద్దని కోరుతూ సీఎం స్టాలిన్‌కు కర్ణాటక సీఎం యడ్యూరప్ప శనివారం లేఖ రాసిన విషయం తెలిసిందే. డ్యాం వ్యవహారంలో కేంద్రంలోని బీజేపీ పాలకులు కర్ణాటకలోని తమ ప్రభుత్వానికి  అనుకూలంగా వ్యవహరించబోతున్న సంకేతాలతో ఆదిలోనే అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్‌ను కలిసి డ్యాం నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వ కూడదని ఒత్తిడి తెచ్చేందుకు నీటి పారుదల శాఖ మంత్రి దురై మురుగన్‌ నేతృత్వంలోని బృందం సోమవారం ఢిల్లీకి వెళ్లనుంది.

మంగళవారం ఈ బృందం కేంద్ర మంత్రితో భేటీ కానుంది. కావేరి జల వివాదం, డ్యాం నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని పట్టుబట్టడమే కాకుండా, మార్కండేయ నదిలో కర్ణాటక నిర్మించిన ఆనకట్ట తదితర అంశాల గురించి చర్చించనున్నారు. అలాగే సీఎం స్టాలిన్‌ తరఫున కేంద్ర మంత్రికి లేఖ సమరి్పంచనున్నారు.  

యడ్డీకి లేఖాస్త్రం
తనకు యడ్యూరప్ప రాసిన లేఖకు సమాధానంగా సీఎం స్టాలిన్‌ ఆదివారం లేఖాస్త్రం సంధించారు. అందులో కావేరి జల వివాదం, కోర్టు తీర్పు, నీటి పంపిణీ తదితర అంశాలను ప్రస్తావించారు. అలాగే తమిళనాడులో సాగుతున్న కావేరి పథకాలను గుర్తు చేస్తూ, ఈ పథకాల కారణంగా తమ రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. అయితే కర్ణాటకలోని మేఘదాతులో నిర్మించతలపెట్టిన డ్యాం కారణంగా తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్ప మేరకు సరిహద్దులోకి నీళ్లు సక్రమంగా వచ్చి చేరాల్సి ఉందన్నారు.

తమిళ రైతులకు నష్టం కలిగించే ప్రయత్నాలు చేయ వద్దని కోరారు. బెంగళూరుకు నీటి అవసరాల పేరిట ఈ డ్యాం నిర్మాణాలు సాగడం లేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ, రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల మెరుగు, కొనసాగింపు లక్ష్యంగా ఈ డ్యాం నిర్మాణ ప్రయత్నాన్ని వీడాలని కోరారు. ఇదిలా ఉండగా మార్కండేయ నదిపై ఆనకట్ట నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం కృష్ణగిరిలో రైతులు నిరసన తెలపనున్నారు.    

మరిన్ని వార్తలు