12 ఏళ్ల ప్రేమ.. వరుడికి ‘వరకట్న’ వేధింపులు.. సొంత తల్లిదండ్రులకు షాక్‌!

19 May, 2022 14:16 IST|Sakshi

ఒకప్పటి కాలంలో పెళ్లి అంటే ఏదో సాధాసీదాగా జరిపించేవాళ్లు. ఒక్క రోజులో వేడుక అయిపోయిది.  కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా వదలకుండా పండుగలా చేసుకుంటున్నారు. పెళ్లి వేడుకలో ఎన్ని మార్పులు వచ్చినా కట్నకానుకల విషయంలో మాత్రం ఏలాంటి మార్పు రాలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ కట్నం విలువ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అబ్బాయి తరపున వారు లక్షల్లో అడుగుతుండటంతో కూతురు సంతోషంగా ఉంటే అదే చాలని భావించిన వధువు తల్లిదండ్రులు అప్పులు చేసి మరి కట్న కానుకలు ముట్టజెపుతున్నారు.

తాజాగా పెళ్లి, కట్నం విషయంలో ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మీరట్‌ జిల్లా కంకర్‌ఖేరా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రోహతాలో ముప్పై ఏళ్ల యోగేష్‌ కుమార్‌ తన తల్లిదండ్రులతో నివాసముంటున్నాడు. అయితే ఆయన 26 ఏళ్ల యువతిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పగా వారు కూడా పెళ్లికి ఓకే చెప్పారు. కానీ వధువు నుంచి భారీగా కట్నం కావాలని షరతు పెట్టారు. వధువు కుటుంబ సభ్యులు అంతగా ఇచ్చుకోలేమని చెబుతున్నా.. ఎంతకీ వినిపించుకోవడం లేదు. దీంతో పెళ్లి కాస్తా సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తోంది.
చదవండి: జ్ఞానవాపి మసీదు వివాదం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దీంతో  కట్నం కారణంగా పెళ్లి వాయిదా పడుతోందని వరుడు తన తల్లిదండ్రులపై జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.  ‘నా గర్ల్‌ఫ్రెండ్‌ మా తల్లిదండ్రులను కాదని నన్ను పెళ్లిచేసుకోలేదు. అలాగే మా తల్లిదండ్రులు కట్నాన్ని తగ్గించేందుకు సిద్దంగా లేరు. వాళ్లు కేవలం డబ్బు మాత్రమే కాదు, ఇంట్లో వస్తువులు కూడా కావాలంటూ పెద్ద లిస్ట్‌ ఇచ్చారు. కానీ నా ప్రియురాలి కుటుంబం అంతగా ఆర్థికంగా ఉన్నవారు కారు. ఈ సమస్యకు పరిష్కారం చూపి,  నా పెళ్లి జరిపించాలి’ అంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే దీనిపై విచారణ చేయాలంటూ మీరట్‌ జిల్లా ఎస్పీ కంకర్‌ఖేరా పోలీసులను ఆదేశించారు. యువకుడు తన తల్లిదండ్రులపై కొన్ని ఆరోపణలు చేశాడని, ప్రథమిక విచారణ అనంతరం ఎఫ్‌ ఐఆర్‌ నమోదు చేస్తామని తెలిపారు.

ఈ విషయంపై యోగేష్‌ మాట్లాడుతూ.. అయిదుగురు అన్నదమ్ముల్లో నేను పెద్దవాడిని. నా తమ్ముళ్లందరు పెళ్లి చేసుకొని స్దిరపడ్డారు. 12 సంవత్సరాలుగా యువతిని ప్రేమిస్తున్నాను. తన చెల్లెలికి కూడా పెళ్లి అయిపోయింది. తల్లిదండ్రులు అధికంగా కట్నం ఇచ్చుకోలేరని తెలిసి యువతి ఇంకా నాకోసం ఎదురుచూస్తుంది. నేను కోర్టులో లేదా ఎప్పుడో ఇంటి నుంచి పారిపోయి ఆ అమ్మాయిని వివాహమాడొచ్చు. కానీ నేను అలా చేస్తే నా తమ్ముళ్లు కూడా అదే నేర్చుకున్నారు. అందుకే అలా చేయలేదు. నా తల్లిదండ్రులు నన్ను కొట్టి ఇంటి నుంచి బయటకు పంపించేశారు. నా సమస్యకు పోలీసులు పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. కాగా తమ 30 ఏళ్ల పోలీస్‌ సర్వీసులో ఇలాంటి కేసు ఎప్పుడూ రాలేదని ఓ పోలీస్‌ అధికారి తెలిపారు. అయితే మొత్తం ఈ విషయంపై యువకుడి తల్లిదండ్రులు ఏం స్పందించలేదు. 
చదవండి: Assam Floods: కొనసాగుతోన్న వరదల బీభత్సం.. 9 మంది మృతి

మరిన్ని వార్తలు