లావున్నావంటూ భర్త వేధించడంతో గృహిణి ఆత్మహత్య

20 Feb, 2024 11:25 IST|Sakshi

ముంబై: భర్త తనను ‘లావున్నావని’ వేధించాడని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్లాం కాండే, తెహ్మీనాలకు 2016లో పెళ్లి జరిగింది. ఇంటి పనుల విషయంలో తల్లిదండ్రులతో గొడవ అవుతుండటంతో అస్లాం భార్యను తీసుకొని వచ్చి బయట ఉంటున్నారు.

అయితే.. కొన్ని రోజుల తరువాత భార్యాభర్తల మధ్యా గొడవలు ప్రారంభం అయ్యాయి. ఓసారి తెహ్మీనా పోలీసులకు పిర్యాదు చేయగా.. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని, అందుకే తనతో గొడవపడుతోందని పోలీసులకు చెప్పాడు. అంతే కాదు.. భార్యను బైకుల్లాలోని ఆమె తల్లి రజియా వసీం అన్సారీ ఇంటిలో దించేశాడు. ఫిబ్రవరి 14న తల్లి బయటికి వెళ్లిన సమయంలో తెహ్మీనా ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త అస్లాంపై కేసు నమోదు చేశారు.

‘నువ్వు లావుగా ఉన్నావు, నీకు డ్రెస్‌సెన్స్‌ లేదు, నీకు పిల్లలు కావడం లేదు’ అంటూ అస్లాం తన కూతురును తరచూ వేధించేవాడని రజియా తెలిపింది. తనకు పిల్లలు పుట్టడం లేదని తన భర్త వేరే పెళ్లి చేసుకున్నాడని తెహ్మీనా తరచూ అనుమానించేదని, ఆ డిప్రెషన్‌తోనే ఆత్మహత్య చేసుకుందని రజియా పోలీసులకు వెల్లడించింది. రజియా ఫిర్యాదు మేరకు అస్లాంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు