భారీ అగ్నిప్రమాదం: కమ్మేసిన పొగ.. పేషెంట్ల ఆర్తనాదాలు!

14 May, 2022 18:14 IST|Sakshi

ఛండీగఢ్‌: ఢిల్లీ ముండ్కా మెట్రో స్టేషన్‌ సమీపంలోని భవంతిలో చెలరేగిన మంటలు 27 మందిని బలిగొన్న ఘటన మరువక ముందే.. మరో అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. పంజాబ్‌ అమృత్‌సర్‌లోని ఓ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 

అమృత్‌సర్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా ఉన్న గురునానక్‌ దేవ్‌ ఆస్పత్రిలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. సమయానికి స్పందించిన సిబ్బంది.. పేషెంట్లను బయటకు తరలించడంతో భారీ విషాదం తప్పింది. భారీగా అలుముకున్న పొగ, పేషెంట్ల ఆర్తనాదాల మధ్య అక్కడి పరిస్థితి తాలుకా వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

శనివారం సాయంత్ర సమయంలో.. ఎక్స్‌రే డిపార్ట్‌మెంట్‌ దగ్గరలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ పేలడం, దాని మంటల నుంచే ఈ భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మంటలను ఆర్పేందుకు ఎనిమిది ఫైర్‌ ఇంజన్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనపై స్పందించిన పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌.. సహాయక చర్యలను సంబంధిత అధికారుల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు