ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట

22 Apr, 2023 06:16 IST|Sakshi

పూంచ్‌:  జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో ఐదుగురు జవాన్లను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల కోసం భారత సైన్యం వేట ముమ్మరం చేసింది. డ్రోన్లు, జాగిలాలతోపాటు హెలికాప్టర్‌తో గాలింపు కొనసాగిస్తోంది. బాటా–డోరియా అటవీ ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది జల్లెడ పడుతున్నారు. గాలింపు చర్యలను సైనిక, పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) బృందం శుక్రవారం ఘటనా స్థలాన్ని సందర్శించింది.

గురువారం ముష్కరుల దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్‌ విభాగానికి చెందిన ఐదుగురు చనిపోవడంతోపాటు మరొకరు గాయపడిన సంగతి తెలిసిందే. అమర జవాన్ల మృతదేహాలకు ఉన్నతాధికారులు శుక్రవారం నివాళులర్పించారు. అనంతరం మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించారు. రాజౌరీ, పూంచ్‌ జిల్లాల్లో హై అలర్ట్‌ విధించారు. నియంత్రణ రేఖ వద్ద నిఘాను పటిష్టం చేశారు. ముష్కరుల దుశ్చర్యను ఖండిస్తూ బీజేపీ, వీహెచ్‌పీ, రాష్ట్రీయ బజరంగ్‌ దళ్, శివసన, డోగ్రా ఫ్రంట్, జమ్మూ స్టేట్‌హుడ్‌ ఆర్గజనైజేషన్‌ జమ్మూలో భారీ ప్రదర్శనలు నిర్వహించాయి.   
 

మరిన్ని వార్తలు