మసీదు తొలగింపు పిటిషన్‌ను స్వీకరించిన మధుర కోర్టు

17 Oct, 2020 08:50 IST|Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో శ్రీకృష్ణ జన్మభూమి దగ్గరున్న షాహీ ఈద్గా మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మధుర జిల్లా కోర్టు శుక్రవారం స్వీకరించింది. ఇదే అంశంపై గత నెలలో విచారణకు మధురలోని సివిల్ కోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపేందుకు జిల్లా జడ్జి సాధనా రాణి థాకూర్‌ అంగీకరించారు. తదుపరి విచారణను నవంబర్‌ 18కి వాయిదా వేశారు. కాగా మధుర శ్రీ కృష్ణుడి జన్మస్థలంగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రదేశంలో కట్ర కేశవ్ దేవ్ దేవాలయానికి చెందిన 13 ఎకరాల స్థలంలో 17వ శతాబ్దంలో షాహీ ఈద్గా మసీదును నిర్మించారు. చదవండి: ‘ఆ వివాదం మళ్లీ తెరపైకి తెచ్చారు’

అయితే శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్, షాహీ ఈద్గా మేనేజ్‌మెంట్ కమిటీ మధ్య కుదిరిన భూ ఒప్పందాన్ని 1968లో మధుర కోర్టు ఆమోదించింది. 1968లో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్‌.. ఈద్గా ట్రస్టు మేనేజ్‌మెంట్ కమిటీతో మోసపూరితంగా రాజీ కుదుర్చుకుందని పిటీషన్‌లో ఆరోపించారు. మొగల్‌ రాజు ఔరంగజేబు మధురలోని కృష్ణ ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారని ఆరోపించారు. కాగా శ్రీకృష్ణ జన్మస్థానం నుంచి షాహీ ఈద్గాహ్ మసీదు ఆక్రమణను తొలగించాలనే అంశంపై మధురలోని సివిల్ జడ్జి కోర్టులో సెప్టెంబర్‌ 30న పిటిషనర్ విష్ణు జైన్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కానీ కేవలం భక్తుడైనంత మాత్రాన భగవంతుడి తరపున కోర్టులో కేసు వేయడానికి అధికారం లేదని చెబుతూ పిటీషన్‌ను కొట్టివేసింది. 

మరిన్ని వార్తలు