అనుమతిస్తే హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో‌ లాక్‌డౌన్‌

17 Nov, 2020 16:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ తీవ్ర కలవర పెడుతోంది. వ్యాక్సిన్‌ ఇంకా తయారీ దశలో ఉండగానే.. రెండోదశ వ్యాప్తి  ఆందోళన కలిగిస్తోంది. మొదటి దశ విజృంభణ నుంచి ఇంకా కోలుకోకముందే మరోసారి వ్యాప్తి చెందడం భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో రెండో విడత లాక్‌డౌన్‌ విధించగా.. మరికొన్ని దేశాలు పాక్షిక ఆంక్షాలు విధిస్తున్నాయి. బ్రిటన్‌, ఫ్రాన్స్‌, అమెరికాలో కొత్త కేసులు నమోదు కావడంతో ప్రపంచ దేశాలను కరోనా భయం వెంటాడుతోంది. ఇక భారత్‌లోనూ పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మొన్నటి వరకు అదుపులోకి వచ్చిందనుకున్న ప్రాణాంతక మహ్మమారి దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తోంది. తాజాగా అక్కడ నమోదవుతున్న కేసులు ప్రభుత్వాలను కలవరపెడుతున్నాయి.

హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్
తాజాగా గడిచిన వారంరోజుల్లో ప్రతిరోజు 4వేలకు పైగా పాజటివ్‌ కేసులు వెలుగుచేస్తున్నాయి. మరోవైపు మృతుల సంఖ్య కూడా భారీగా పెరగడం అధికార యంత్రానికి చెమటలు పుట్టిస్తోంది. దీపావళి పండగ సీజన్, చలికాలం రావటంతో కేసుల సంఖ్య రోజు రోజుకి రెట్టింపు అవుతోంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. మరికొన్నాళ్ల పాటు ఇలానే కొనసాగితే మరోసారి లాక్‌డౌన్‌ విధించేందుకు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దారులు వెతుకుతున్నారు. కేంద్ర అనుమతి ఇస్తే హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధిస్తామని ప్రకటించారు. (మహమ్మారి ‘పుట్టిన రోజు’ నేడే..!)

ఈ మేరకు మంగళవారం వైద్యారోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన కేజ్రీవాల్‌ అనంతరం మీడియాతో మాట్లాడారు. రోజు పెరుగుతున్న కరోనా కేసులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఢిల్లీలో పాక్షికంగా లాక్ డౌన్ పెట్టె యోచనలో ఉన్నాము. దాని కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరాం. ఎక్కువగా కేసులు నమోదు అవుతున్న మార్కెట్లలను కొన్నాళ్లు మూసివేయలనే ఆలోచనలో ఉన్నాము. స్థానిక మార్కెట్లలో నిబంధనలు పాటించడం లేదు. అందుకే అవి కరోనా హాట్ స్పాట్ జోన్ లుగా మారుతున్నాయి.

జాగ్రత్తగా ఉంటేనే నియంత్రణ..
కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తోంది. కోవిడ్ బాధితుల కోసం కొత్తగా 750 ఐసీయూ బెడ్లను కేటాయించినందుకు ధన్యవాదాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు కరోనా నియంత్రణకు కష్టపడుతున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉంటేనే నియంత్రణకు సాధ్యం అవుతుంది. సామాజిక దూరం, మాస్కులు తప్పకుండా ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి. ఢిల్లీలో కరోనా తగ్గిన సమయంలో 200 మించి శుభకార్యాలకు హాజరయ్యారు... దాని వల్ల కూడా కరోనా పెరిగింది.ఇప్పుడు శుభకార్యాల కోసం కేవలం 50 మందికి మించి అనుమతి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నాము.లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి కోసం లెటర్ పంపాము’ అని  ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు