Maya Rathod: గైనకాలజిస్టు, ఇద్దరు పిల్లల తల్లి.. బాడీ బిల్డర్‌గా

17 Jul, 2021 14:17 IST|Sakshi

Bodybuilder Maya Rathod (సాక్షి, వెబ్‌డెస్క్‌): ‘‘అమ్మాయివి నీకెందుకు ఆటలు.. కరాటేలు, తైక్వాండోలు అంటూ బెట్టు చేస్తే కష్టం..  కాలో.. చెయ్యో విరిగితే నిన్ను ఎవరూ పెళ్లి చేసుకోరు.. కావాలంటే డాన్స్‌ నేర్చుకో.. పద్ధతిగా ఉంటుంది.. అంతేకానీ.. మనకు ఇట్లాంటి ఆటలు వద్దు’’... సగటు మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లలకు ఉండే ‘సహజమైన’ ఆంక్షలు ఇవి. ముంబైకి చెందిన మాయా రాథోడ్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. తాను తైక్వాండో శిక్షణ తీసుకుంటానని చెప్పినపుడు ఆమె తల్లిదండ్రులు కూడా ఇలాగే వారించారు. చక్కగా చదువుకుంటే చాలని, అనవసర ఆలోచనలతో తమను ఇబ్బంది పెట్టవద్దని సున్నితంగా మందలించారు. అమ్మానాన్నల మాట కాదనలేకపోయింది మాయా. 

తండ్రి కోరుకున్నట్టుగానే డాక్టర్‌ అయ్యింది. పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది. ఇద్దరు పిల్లల తల్లిగా, గైనకాలజిస్టుగా అటు వ్యక్తిగత, ఇటు వృత్తిగత జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టింది. కానీ అథ్లెట్‌ కావాలన్న కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది ఆమె మనసులో. ఎక్కడో ఏదో వెలితి. పైగా రోజురోజుకు పెరుగుతున్న బరువు. తీవ్ర ఒత్తిడికి లోనైంది. తనను తాను కనుగొనే మార్గం కోసం అన్వేషించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో బాడీ బిల్డర్‌గా ఎదిగి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ బాడీబిల్డింగ్‌ అండ్‌ ఫిట్‌నెస్‌(ఐఎఫ్‌బీబీ) ఆస్ట్రేలియన్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలిచిన తొలి శ్వేతజాతీయేతర మహిళగా నిలిచింది.

ఆరంకెల జీతం.. అయినా సంతోషం లేదు 
‘‘చిన్నప్పటి నుంచీ నాకు క్రీడలంటే ఆసక్తి. మా కాలేజీ క్యాంపస్‌లో బెస్ట్‌ అథ్లెట్‌ నేనే. కానీ నా తల్లిదండ్రులకు ఈ విషయం ఏమాత్రం నచ్చేది కాదు. ఆటలాడేటపుడు ఒకవేళ గాయపడితే.. నన్నెవరూ పెళ్లి చేసుకోరనేది వారి భయం. అయినా, నేను వెనుకడుగు వేయలేదు. భరతనాట్యం క్లాసులు ఎగ్గొట్టి మరీ తైక్వాండో శిక్షణ తీసుకున్నా. అంతేకాదు సాయంకాలం వేళ గ్రౌండ్‌కు వెళ్లి క్రికెట్‌ కూడా ఆడేదాన్ని!. అథ్లెట్‌ కావాలన్న ఆశయం గురించి మా నాన్నకు చెప్పినపుడు.. ‘‘నువ్వు అమ్మాయివి. బాగా చదువుకుని గౌరవప్రదమైన వృత్తి చేపట్టినపుడే మనకు మంచి పేరు వస్తుంది’’ అని చెప్పారు.

ఆయన చెప్పిన బాటను అనుసరించాను. మెడికల్‌ కాలేజీలో సీటు సంపాదించి గైనకాలజీ పూర్తిచేశాను. కాలేజీ చదువు అయిపోగానే పెళ్లి చేశారు. సంవత్సరం తిరిగేలోపే తల్లినయ్యాను. మంచి డాక్టర్‌గా పేరు. ఆరంకెల జీతం. అయినా.. నాకు సంతోషం లేదు. స్థూలకాయురాలిలా మారిపోయాను. ఊరికే అలసిపోయేదాన్ని. ఏదో తెలియని భయం ఆవహించింది. నన్ను నేను కోల్పోతున్న భావన. ఆ సమయంలో నా స్నేహితురాలు ఒకరు.. జిమ్‌కు వెళ్లమని సూచించింది.

20 కిలోల బరువు తగ్గాను
అలా ఏడాది కాలంలో 20 కిలోల బరువు తగ్గాను. మా కోచ్‌ ఆశ్చర్యపోయారు. బాడీ బిల్డింగ్‌ చేయవచ్చు కదా అని సలహా ఇచ్చారు. నాకు మొదటి నుంచి బరువులు ఎత్తడం అంటే ఇష్టం. వెంటనే ఓకే అన్నాను. బాడీ బిల్డింగ్‌ పోటీలకు వెళ్లిన తొలినాళ్లలో అక్కడ చాలా తక్కువ మంది మహిళలు కనిపించేవారు. కాస్త మొహమాటంగా అనిపించేది. కానీ నా భర్త నన్ను ప్రోత్సహించేవారు. అయితే, మా అమ్మానాన్న, అత్తామామలు మాత్రం.. ‘‘మంచి జాబ్‌ వదులుకుని... ఇదంతా అవసరమా’’ అని నిట్టూర్చేవారు. నన్ను నేను నిరూపించుకోవాలని ఫిక్స్‌ అయ్యాను. 

మళ్లీ శిక్షణ మొదలుపెట్టాను. అప్పటికి మా పాప ఇంకా నా చనుబాలు తాగుతూనే ఉంది. తన ఆలనాపాలన, ఆస్పత్రిలో షిఫ్టుల్లో ఉద్యోగం, జిమ్‌కు వెళ్లడం... అబ్బో.. కాస్త కూడా విశ్రాంతి తీసుకునే సమయం ఉండేది కాదు. అనుకున్నది సాధించడానికి ఇవన్నీ తప్పవు మరి. రెండేళ్ల తర్వాత విజయం నన్ను వరించింది. స్టేట్‌ లెవల్‌ చాంపియన్‌షిప్‌లో రెండో స్థానం. ఈ క్రమంలో.. పీహెచ్‌డీ పూర్తి చేసేందుకు మూడేళ్ల తర్వాత సిడ్నీకి షిఫ్ట్‌ అయ్యాం. అప్పుడే రెండో కూతురు జన్మించింది.

ఆస్ట్రేలియా గడ్డ మీద తొలి మహిళగా
అక్కడికి వెళ్లాకే నాకొక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. గత 25 ఏళ్లలో అక్కడ ఒక్కరంటే ఒక్కరు కూడా భారతీయ మహిళా బాడీబిల్డర్‌ లేరని చెప్పారు. ఒక భారతీయురాలిగా నేను ఈ విజయం సాధించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఎనిమిది నెలల పాటు కఠోర శ్రమ... ఉదయం నాలుగు నుంచి ఏడు గంటల వరకు ట్రెయినింగ్‌, పెద్దమ్మాయిని స్కూళ్లో దింపడం, వంట చేయడం, ఆస్పత్రికి వెళ్లడం... ఇంటికి వచ్చి మళ్లీ పనులు చేసుకుని పిల్లల్ని నిద్రపుచ్చడం.. తర్వాత రాత్రి 10 నుంచి ఒంటి గంట వరకు ప్రాక్టీస్‌. ఎట్టకేలకు నా శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. ఐఎఫ్‌ఎఫ్‌బీ 2021 ఆస్ట్రేలియన్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ రూపంలో విజయం వరించింది.

ఆస్ట్రేలియా గడ్డమీద ఈ ఘనత సాధించిన తొలి నల్లజాతి మహిళగా నిలిచాను. ప్రస్తుతం నా వయస్సు 30 ఏళ్లు. ఇప్పటికీ గైనకాలజిస్టుగా పనిచేస్తున్నా. ఎనిమిదేళ్లుగా బాడీబిల్డర్‌గా వివిధ పోటీల్లో రాణిస్తున్నా. పెళ్లై.. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నేను ఇంతదాకా వస్తానని అస్సలు ఊహించలేదు. నాలో ఉన్న నిజాయితే నన్ను ఈరోజు ఈస్థానంలో నిలబెట్టింది. నేను ప్రేమించిన లక్ష్యం కోసం.. ఇతరులు ఏమనుకున్నా లెక్కచేయలేదు. ఉన్నది ఒక్కటే జీవితం.. మనకు నచ్చింది చేయాలి. నేను తల్లిని, వైద్యురాలిని, బాడీ బిల్డర్‌ను అని గర్వంగా చెప్పగలను’’ అని మాయా రాథోడ్‌ ఇటీవల హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే పేజీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విజయగాథ గురించి పంచుకున్నారు.

మరిన్ని వార్తలు