యోగీ రాజీనామా చెయ్యి.. రాష్ట్రపతి పాలన పెట్టండి!

1 Oct, 2020 13:04 IST|Sakshi

వరుస హత్యాచార ఘటనలపై మాయావతి ఆగ్రహం

సీఎం యెగిపై  మాయావతి ధ్వజం

సాక్షి, ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లో వరుస హత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలల్ని రగిలిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో హత్రాస్, బలరాంపూర్ ఘటనలపై బీఎస్‌పీ అధినేత మాయావతి  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలో నేరస్థులు, మాఫియా, రేపిస్టులకు అడ్డూ అదుపూలేకుండా పోతోందన్నారు. 'జంగిల్‌రాజ్' యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో నేరాలు, ముఖ్యంగా దళిత బాలికలపై నేరాలు పెరిగిపోతున్నాయంటూ యోగిపై ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగీ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. (నడుం, కాళ్లు విరిచి.. వరుస అఘాయిత్యాలు)

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణిస్తోందని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని  మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు యోగీ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారన్నారు. మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైన రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. హత్రాస్ బల్రాంపూర్ ఘటనలు తనను తీవ్రంగా కలిచి వేశాయని, నిర్భయ కేసును గుర్తుకు తెచ్చాయని మాయావతి ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు జరగని రోజు ఒక్కటి కూడా లేదని విమర్శించారు. తనకూ ఒక ఆడకూతురు ఉందనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలని, ఆడబిడ్డలను రక్షించ లేని యోగి వెంటనే రాజీనామా చేయాలని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు స్వ‌స్థ‌ల‌మైన గోర‌ఖ్‌పూర్ మ‌ఠానికి  యోగిని పంపించాల‌ని మాయావ‌తి వ్యాఖ్యానించారు.  (కాల్చి బూడిద చేసేశారు.. ఇదెక్కడి న్యాయం!)

అలాగే హత్రాస్ హత్యాచార బాధితురాలి మృతదేహాన్ని ఆమె కుటుంబానికి అప్పగించకుండా, అర్ధరాత్రి దహనం చేసిన యూపీ పోలీసులపై మాయావ‌తి మండిపడ్డారు. ఇది సిగ్గుచేటైన సంఘటన అని బీఎస్పీ చీఫ్ దుయ్యబట్టారు. ఇది జంగిల్‌రాజ్యం కాకపోతే, మరేంటి? అని ప్రశ్నించారు. బాధితుల కుటుంబానికి అండగా నిలిచిన ప్రతిపక్షాలను ప్రశంసించిన మాయవతి  తమ పార్టీ  కూడా బాధిత కుటుంబం తరపున పోరాడు తుందన్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ బలరాంపూర్, ఆజంగర్  వరుస దారుణాలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.  యోగి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

కాగా హత్రాస్  సంఘటనపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యుల సిట్ ఏర్పాటు చేసినట్లు సీఎం యోగి బుధవారం తెలిపారు. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి భగవాన్ స్వరూప్‌తో కూడిన ముగ్గురు సభ్యుల బృందంలో మహిళా సభ్యులతో పాటు దళిత వర్గానికి చెందిన సభ్యులు కూడా ఉంటారు  ఈ బృందం ఏడు రోజుల్లో నివేదిక సమర్పించనుందని,  ఈ కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించనున్నామని తెలిపారు. అలాగే బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు రూ .25 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇల్లు ఇస్తామని రాష్ట్రం ప్రకటించింది. వీడియోలింక్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడిన సీఎం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు