పార్లమెంట్‌ ఎన్నికలు.. బీఎస్పీ పోటీపై మాయావతి కీలక ప్రకటన

15 Jan, 2024 16:26 IST|Sakshi

లక్నో: బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక ప్రకటన చేశారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో తాము ఒంటిరిగానే బరిలోకి దిగుతున్నట్టు  మాయావతి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఏ కూటమితోనూ పొత్తులు ఉండవని క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో రాజకీయాల్లో తన రిటైర్మెంట్‌ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా, మాయావతి సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏ కూటమితోనూ పొత్తు ఉండదు. ఎన్నికల అనంతరం పొత్తుల విషయంపై ఆలోచిస్తాం. అప్పుడు పొత్తులు ఉంటే ఉండొచ్చు. ఇప్పటి వరకు ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసిన సందర్భంలో బీఎస్పీకి చేదు అనుభం ఎదురైంది. పార్టీకి జరిగే మేలు కంటే నష్టమే ఎక్కువగా ఉంటోంది. తమ ఓట్లు భాగస్వామ్యపక్షానికి బదిలీ అయినప్పటికీ.. అటు ఓట్లు మాత్రం ఇటు రావడం లేదు. కాబట్టి ఎన్నికల్లో పొత్తుల్లేకుండానే ఈ సారి ఎన్నికలకు వెళతాం’ అని స్పష్టం చేశారు.

దీంతో, తాము ఇండియా కూటమిలో చేరడం లేదని మాయవతి క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎస్పీలతో పొత్తులు కుదుర్చుకుని ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు.. మాయావతి తన రిటైర్మెంట్‌ గురించి ప్రస్తావించారు. తన తుదిశ్వాస వరకు రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టంచేశారు. వెనకబడిన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తానని చెప్పారు. ఇదే సమయంలో రామమందిర ప్రాణప్రతిష్టకు సంబంధించి తనకు ఆహ్వానం అందిందన్నారు. అయితే, పార్టీ కార్యక్రమాల దృష్ట్యా వెళ్లాలా వద్దా అనే అంశంపై ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. తమది సెక్యూలర్‌ పార్టీ అని చెప్పుకొచ్చారు. 

>
మరిన్ని వార్తలు