‘కింగ్‌ ఆఫ్‌ స్పైసెస్‌’ ఇకలేరు

3 Dec, 2020 10:08 IST|Sakshi

ఎండీహెచ్‌ అధినేత మహాశయ్‌ ధరమ్‌పాల్‌ గులాటి మృతి

చిన్న కొట్టుతో ప్రారంభమైన ప్రస్థానం

‘కింగ్‌ ఆఫ్‌ స్పైసెస్’‌గా గుర్తింపు

న్యూఢిల్లీ: భారత ప్రఖ్యాత మసాలా(స్పైసెస్‌) బ్రాండ్‌ మహాషియాన్‌ ది హట్టి(ఎండీహెచ్‌) అధినేత మహాశయ్‌ ధరమ్‌పాల్‌ గులాటి(98) కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా ఢిల్లీ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ధరమ్‌పాల్‌ జీ వ్యక్తిత్వం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. సమాజ సేవకై తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని కేజ్రీవాల్‌ ట్విటర్‌ వేదికగా నివాళులు అర్పించారు. ఇక మనీష్‌ సిసోడియా.. ‘‘దేశంలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యాపారవేత్త, ఎండీహెచ్‌ యజమాని ధరమ్‌పాల్‌ మహాశయ్‌ నేడు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన లాంటి మంచి మనసున్న మనిషిని నేనెప్పుడూ చూడలేదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’’ అని ట్వీట్‌ చేశారు.(చదవండి: కరోనా: మాజీ ఎంపీ పృథ్వీరాజ్  మృతి)

చిన్న కొట్టుతో ప్రారంభమైన ప్రస్థానం
మహాశయ్‌ ధరమ్‌పాల్‌ 1923లో సియల్‌కోట్‌(ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది)లో జన్మించారు. ఐదో తరగతిలోనే చదువు మానేశారు. తండ్రి చున్నీలాల్‌ గులాటి మసాలా దినుసుల వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉండేవారు. దేశ విభజన తర్వాత భారత్‌కు చేరుకున్న మహాశయ్‌, తమ కుటుంబ వ్యాపారాన్ని విస్తరించేందుకు నిర్ణయించుకున్నారు. తొలుత చిన్న కొట్టు పెట్టిన మహాశయ్‌, 1953లో ఢిల్లీలోని చాందినీ చౌక్‌ కేంద్రంగా మసాలా దినుసుల వ్యాపారాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి కోట్లాది రూపాయలు ఆర్జించారు. ‘కింగ్‌ ఆఫ్‌ స్పైసెస్’‌గా ఖ్యాతి గడించారు.(చదవండి:  అమెరికాలో తెలంగాణవాసి మృతి)

కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా స్కూళ్లు, ఆస్పత్రులు కట్టించి సామాజిక సేవలో కూడా భాగమవుయ్యారు. ఆయన సేవలకు గానూ భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది. ఇక 94 ఏళ్ల వయసులో ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ విభాగంలో అత్యంత ఎక్కువ వేతనం పొందిన(రూ. 21 కోట్లు) భారత సీఈఓగా ఆయన రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎండీహెచ్‌ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది. ఇండియాలో రెండో బెస్ట్‌ సెల్లింగ్‌ స్పైసెస్‌ బ్రాండ్‌గా కూడా ఎండీహెచ్‌ గుర్తింపు పొందింది.

మరిన్ని వార్తలు