మీడియా తప్పుగా అర్థం చేసుకుంది: నితీష్‌

13 Nov, 2020 12:26 IST|Sakshi

పాట్నా : బిహార్‌ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ గురువారం మొదటిసారి విలేకరులతో పాట్నాలో సమావేశమయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు తమ కూటమికే అవకాశం ఇచ్చారని అన్నారు. అయితే గతంలో తాను చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందన్నారు. ఈ ఎన్నిక తనకు చివరిది కాదని స్పష్టం చేశారు. తాను గత సమావేశంలో పదవీ విరమణ గురించి మాట్లాడలేదని పేర్కొన్నారు.

‘‘ప్రతీ ఎన్నికల చివరి ర్యాలీలో నేను ‘ముగింపు బాగుంటే, అంతా బాగుంటుంది’ (అంత్‌ బలా తో సబ్‌ బలా) అనే మాటతో ముగిస్తాను. దీనిని అస్పష్టంగా అర్థం చేసుకున్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా అంకితభావంతో పరిపాలన కొనసాగిస్తాన’’ని అన్నారు. కాగా, నితీష్‌ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసే ముందు రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేయాల్సి ఉంటుంది. అనంతరం తాజాగా ఎన్డీయే కూటమి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆయన్ను తమ నేతగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాలకు గానూ ఎన్డీయే కూటమి 125 సీట్లను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో బీజేపీ 74 స్థానాలు, జేడీయూ 43 స్థానాలు గెలుచుకుంది. గట్టిపోటీనిచ్చిన ఆర్జేడీ నాయకత్వంలోని విపక్ష మహా కూటమి 110 స్థానాలతో సరిపెట్టుకుంది.   (ఎల్జేపీపై బీజేపీదే నిర్ణయం: నితీశ్‌)

మరిన్ని వార్తలు