సెకండ్‌ వేవ్‌లో 400 మందికి పైగా వైద్యులు మృతి

22 May, 2021 15:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విలయ తాండవం ప్రపంచాన్ని వణికిస్తోంది. మరో వైపు డాక్టర్లు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా..అంకితభావంతో ప్రజలకు వైద్యసేవలను అందిస్తున్నారు. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు పణంగా పెట్టి కోవిడ్‌ బాధితులను రక్షిస్తున్న డాక్టర్లు వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా రెండో వేవ్‌లో కోవిడ్‌ సోకి 420 మందికిపైగా వైద్యులు కన్నుమూసినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్  వెల్లడించింది. 

ఈ ఒక్క వారంలోనే కరోనావైరస్ కారణంగా 270 మంది వైద్యులు మరణించినట్లు తెలిపింది. వీరిలో 100 మందికిపైగా ఢిల్లీకి చెందిన వారేనని పేర్కొంది. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రకారం..కరోనా ఫస్ట్‌ వేవ్‌లో 748 మంది వైద్యులు మరణించారు. ఐఎంఎఫ్‌ దాదాపు 3.35 లక్షల మంది సభ్యుల సమాచారాన్ని మాత్రమే రికార్డు చేసి ఉంచుతుంది. అయితే దేశంలో 12 లక్షలకు పైగా వైద్యులు ఉన్నారు. 

ఇక దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 2,57,299 కరోనా కేసులు నమోదైనట్లు, 4,194 మంది ప్రాణాలు కోల్పోయిట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గత నెల దేశరాజధాని ఢిల్లీ కరోనాతో తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఢిల్లీ తరువాత అత్యధికంగా బీహార్‌లో 96 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లో 41 మంది, గుజరాత్‌లో 31 మంది, తెలంగాణలో 20 మంది, పశ్చిమ బెంగాల్‌, ఒడిశాల్లో 16 మంది చొప్పున చనిపోయినట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తెలిపింది.

(చదవండి: వైరల్‌: వృద్ధుడి స్టెప్పులకు..నెటిజన్ల కళ్లు జిగేల్‌)

>
మరిన్ని వార్తలు