Maharashtra: హ్యాట్సాఫ్‌ యశోధరా.. ‘ఎంబీబీఎస్‌’ చదువుతూనే ‘సర్పంచ్‌’గా ఎన్నిక

21 Dec, 2022 17:06 IST|Sakshi

ముంబై: యశోధరా షిండే.. 21 ఏళ్ల ఈ యువతి డాక్టర్‌ కావాలని కలలు కన్నది. అందుకు తగ్గట్లుగా జార్జియా వెళ్లి ఎంబీబీఎస్‌ చదువుతోంది. కానీ, ఆమెకు విధి మరో కొత్త రంగాన్ని అందించాలని తలపించింది. ఆమెను గ్రామానికి తిరిగి వచ్చేలా చేసింది. ఇటీవల జరిగిన సర్పంచ్‌ ఎన్నికల బరిలో నిలిచింది యశోధరా. భారీ మెజారిటీతో సర్పంచ్‌గా ఘన విజయం సాధించింది. చిన్న వయసులోనే సర్పంచ్‌గా ఎన్నికై అందరి మన్ననలు పొందుతోంది. ఈ సంఘటన మహారాష్ట్ర, సంగ్లీ జిల్లాలోని మిరాజ్‌ తహసీల్‌ వడ్డి గ్రామంలో జరిగింది. యశోధరా సర్పంచ్‌గా పోటీ చేయాల్సి రావటంపై ఆమె మాటల్లోనే.. 

‘జార్జియాలోని న్యూ విజన్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ చదువుతున్నాను. ఇప్పుడు నేను నాలుగో సంవత్సరంలో ఉన్నా. ఇంకా ఏడాదిన్నర కోర్సు మిగిలి ఉంది. మా గ్రామంలో ఎన్నికలు ప్రకటించిన క్రమంలో మా ఇంటి నుంచి ఎవరైనా పోటీ చేయాలని స్థానికులు కోరారు. సర్పంచ్‌గా నన్ను బరిలో నిలపాలని మా కుటుంబంతో పాటు అంతా నిర్ణయించారు. ఆ తర్వాత నాకు ఫోన్‌ చేసి చెప్పడంతో వచ్చాను. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాను.’

- యశోధరా షిండే, వడ్డి గ్రామ సర్పంచ్‌

తమ గ్రామం వడ్డి అభివృద్ధి కోసం పాటుపడతానని, మహిళలు స్వయంసమృద్ధిగా ఎదిగేందుకు, విద్యార్థుల కోసం ఈ లర్నింగ్‌, ఇతర మెరుగైన విద్యావిధాలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొంది యశోధరా. రైతుల సంక్షేమంతో పాటు యువతకు అన్ని సౌకర్యాలు ఉండేలా చూస్తానని ధీమా వ్యక్తం చేశారు. మహిళలకు సమానమైన అవకాశాలు రావాలని, అందుకు తగినట్లుగా వారు చదువుకుని స్వతంత్రంగా జీవించేందుకు కృషి చేస్తానని నొక్కి చెప్పారు యశోధరా. మరోవైపు.. తన ఎంబీబీఎస్‌ చదువును కొనసాగిస్తానని, ఆన్‌లైన్‌ విధానంలో పూర్తి చేస్తానని వెల్లడించింది. 

మహారాష్ట్రలోని 7,682 గ్రామ పంచాయతీలకు డిసెంబర్‌ 18న ఎన్నికలు జరిగాయి. సర్పంచ్‌ ఎన్నికల ఓటింగ్‌ ఫలితాలను గత మంగళవారం వెల్లడించారు.

ఇదీ చదవండి: కోవిడ్‌ కేసుల పెరుగుదల ఆందోళనకరమే.. కానీ: అదర్‌ పూనావాలా

మరిన్ని వార్తలు