12,638 వజ్రాలతో ఉంగరం

6 Dec, 2020 03:53 IST|Sakshi

గిన్నిస్‌ రికార్డుల్లోకి ‘మారిగోల్డ్‌ డైమండ్‌ రింగ్‌’

మీరట్‌: హైదరాబాద్‌కు చెందిన నగల వ్యాపారి కొట్టి శ్రీకాంత్‌ నెల క్రితమే 7,801 వజ్రాలు పొదిగిన ఉంగరం తయారు చేసి గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. తాజాగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన నగల దుకాణదారు ఆ రికార్డును బద్దలు కొట్టారు. మీరట్‌కు చెందిన హర్షిత్‌ బన్సాల్‌ ఏకంగా 12,638 వజ్రాలు పొదిగిన రింగ్‌ను తయారు చేశారు. 8 పొరలతో 165.45 గ్రాముల బరువున్న ఉంగరానికి మారిగోల్డ్‌ డైమండ్‌ రింగ్‌ అనే పేరు పెట్టారు. ఇది గిన్నిస్‌ ప్రపంచ రికార్డుల్లో స్థానం సంపాదించింది. రూపశిల్పి, 25 ఏళ్ల హర్షిత్‌ మాట్లాడుతూ.. ‘6,690 వజ్రాలతో తయారైన ఉంగరం గిన్నిస్‌ రికార్డుల్లో ఉన్నట్లు 2018లో తెలుసుకున్నాను.

అనంతరం 2018లో మొదలుపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమం చివరికి 2020 ఫిబ్రవరిలో ముగింపునకు వచ్చింది. గిన్నిస్‌ ప్రపంచ గుర్తింపు లభించింది.  ఇలా భారీ సంఖ్యలో వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని రూపొందించడం క్లిష్టమైన పనే’ అని చెప్పారు. ఉంగరం తయారీలో ఇంటర్నేషనల్‌ జెమాలజీ లేబొరేటరీ ధ్రువీకరించిన శుద్ధమైన వజ్రాలను వినియోగించినట్లు తెలిపారు. ‘రింగ్‌ డిజైన్‌పై చాలా కసరత్తు చేసి చివరికి మా పెరట్లోని మారిగోల్డ్‌ పుష్పం రూపం బాగా నచ్చింది. ఆ పువ్వు రేకులను పోలిన డిజైన్‌తో చేయాలని నిర్ణయిం చుకున్నాను. ఉంగరంలోని ఏ రెండు రేకులు కూడా ఒకేలా ఉండకపోవడం దీని ప్రత్యేకత. ఈ రింగ్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. అమ్మాలనుకోవడం లేదు. దీనిని నాతోనే ఉంచుకుంటాను’అని చెప్పారు.

మరిన్ని వార్తలు