భార్య లావైపోయిందని ఇంట్లోంచి గెంటేసి.. విడాకులు కోరిన భర్త!

1 Sep, 2022 18:41 IST|Sakshi

లక్నో: పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సన్నగా, నాజూగ్గా ఉండాలని కోరుకుంటారు యువకులు. కొందరు అనుకున్నట్లుగానే సన్నగా, అందంగా ఉండే అమ్మాయినే వివాహం చేసుకుంటారు. కానీ, పెళ్లయ్యాక లావెక్కితే ఏంటి పరిస్థితి అనే ఆలోచన చేయరు. ఈ కోవకే చెందిన ఓ వ్యక్తి.. పెళ్లయ్యాక తన భార్య లావైపోయిందని ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. తనకు విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌ ప్రాంతంలో వెలుగు చూసింది. తాను లావైపోయాననే కారణంగా తన భర్త సల్మాన్‌ ఇంట్లోంచి వెళ్లగొట్టాడని తెలిపింది బాధితురాలు నజ్మా. 

మీరట్‌లోని జకిర్‌ కాలనీకి చెందిన నజ్మాకు ఎనిమిదేళ్ల క్రితం ఫతేపుర్‌కు చెందిన సల్మాన్‌తో వివాహం జరిగింది. వారికి ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే, పెళ్లి తర్వాత నజ్మా బరువు పెరిగింది. దీంతో ఆమెను రోజు లావైపోయావని, నీలా ఎవరు బతకరంటూ భర్త వేధిస్తుండేవాడు. ‘నేను బరువు పెరిగిన కారణంగా నాతో జీవించాలని అనుకోవట్లేదని నా భర్త చెప్పాడు. విడాకుల పత్రాలు పంపించాడు. కానీ, నాకు అతనితోనే జీవించాలని ఉంది. విడాకులు వద్దు.’ అని వాపోయింది నజ్మా.

డైవర్స్‌ పేపర్స్‌ పంపించిన తర్వాత తనకు న్యాయం చేయాలని లిసారి గేట్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించింది బాధితురాలు నజ్మా. అయితే, ఈ విషయంపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని పోలీసులు తెలపటం గమనార్హం. తమకు సమాచారం అందితే.. దర్యాప్తు చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామన్నారు కొత్వాలి మీరట్‌ సీఐ అరవింద్‌ చౌరాసియా.

ఇదీ చదవండి: వైఫ్‌ అంటే వాడుకుని వదిలేసే వస్తువు కాదు.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు

మరిన్ని వార్తలు