హ్యాట్సాఫ్‌ షాలినీ: స్టూడెంట్‌ అనగానే సొల్లు కార్చుకుంటూ మాట్లాడారు.. తీరా చూస్తే..

13 Dec, 2022 07:35 IST|Sakshi

భుజాన బ్యాగ్‌తో ఆమె అందరిలాగే కాలేజీకి వెళ్లింది. క్యాంటీన్‌లో పిచ్చాపాటి కబుర్లతో కాలక్షేపం చేసింది. అమ్మాయి కావడంతో.. సాధారణంగా కొందరు యువకులు  నెంబర్‌ అడిగి తీసుకున్నారు. ఆమె కూడా వాళ్లతో  ఫోన్‌ ఛాటింగ్‌లతో గడిపింది. సరదాగా క్లాసులు బంక్‌ కొట్టి సినిమాలు, షికార్లకు వెళ్లింది. ఇంతా స్టూడెంట్‌ అనే ముసుగులోనే! కానీ, ఆ ముసుగు వెనుక అసలు రూపం మొన్నటిదాకా ఎవరికీ తెలియదు.

షాలినీ చౌహాన్‌.. గత 24 గంటలుగా దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు. స్టూడెంట్‌ ముసుగుతో ర్యాగింగ్‌ భూతం.. కొమ్ములు వంచిన ఈ ఖాకీ చొక్కాకి, ఆ ప్రయత్నంలో ఆమె ప్రదర్శించిన తెగువకి దేశం మొత్తం సలాం కొడుతోంది. 

మధ్యప్రదేశ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ అయిన షాలినీ చౌహాన్‌(24).. స్టూడెంట్‌ వేషంలో ర్యాగింగ్‌ చేసేవాళ్లను పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. ఇండోర్‌ మహాత్మా గాంధీ మెమోరియల్‌ కాలేజీలో ఆమె ర్యాగింగ్‌ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది. మూడు నెలలుగా కాలేజీ క్యాంపస్‌లోనే స్టూడెంట్‌ ముసుగులో ఆమె ఇండోర్‌ పోలీసులు నిర్వహించిన అండర్‌ కవర్‌ ఆపరేషన్‌లో పాల్గొంది. పదకొండు మంది సీనియర్లు ర్యాంగింగ్‌ పేరిట వేధిస్తున్న వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది ఆమె. దీంతో.. ఆ విద్యార్థులను కాలేజీ యాజమాన్యం మూడు నెలల పాటు సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

ఇన్‌స్పెక్టర్‌ తజీబ్‌ ఖ్వాజీ నేతృత్వంలో.. కానిస్టేబుల్‌ షాలినీ ఈ ఆపరేషన్‌కు దిగింది. తరచూ ఆ కాలేజీలో జూనియర్ల నుంచి ర్యాగింగ్‌ వ్యవహారం దృష్టికి వస్తుండడం.. అవి మరీ శ్రుతి మించి ఉంటోందన్న విషయం తెలియడంతో పోలీసులు క్యాంపస్‌లో పర్యటించారు. అయితే భయంతో ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో స్టూడెంట్‌ మాదిరి ఉన్న షాలినీ రంగంలోకి దించారు ఖ్వాజీ. షాలినీ, మరికొందరు కానిస్టేబుల్స్‌తో కలిసి క్యాంపస్‌లో సివిల్‌ డ్రెస్‌లో కలియదిరిగింది. విద్యార్థులతో మాట్లాడడం మొదలుపెట్టింది. తాను విద్యార్థుల్లో కలిసి పోయింది. జూనియర్లు, సీనియర్ల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంది. ర్యాంగింగ్‌ మరీ దారుణంగా ఉంటుందని గుర్తించింది. ఈ క్రమంలో.. ర్యాంగింగ్‌కు పాల్పడుతున్న ఆకతాయిలను గుర్తించింది. తన ఐడెంటిటీ రివీల్‌ చేయకుండానే వివరాలను సేకరించింది.   

అయితే.. ఈ మూడు నెలల కాలంలో ఎవరికైనా అనుమానం రాలేదా? అని షాలినీని అడిగితే.. టాపిక్‌ మార్చేదానినని చెప్పిందామె. అమ్మాయిని కావడంతో.. స్టూడెంట్స్‌ కొందరు సొల్లు కార్చుకుంటూ మాట్లాడేవారని, అదే తనకు బాగా కలిసి వచ్చిందని చెప్తోందామె.

మరిన్ని వార్తలు