ఆదర్శనీయులు ఆర్కాట్‌ నవాబులు.. ‘డచ్చస్‌’ క్లబ్‌ ప్రశంసలు

29 Jun, 2021 08:49 IST|Sakshi
ఆర్కాట్‌ నవాబు ఆసీఫ్‌ అలీ

సాక్షి, చెన్నై(తమిళనాడు): ఆర్కాట్‌ నవాబులు సంస్కృతి, సంప్రదాయాలకే కాదు, కుల మతాలకు అతీతంగా సేవలు అందించడంలో ఆదర్శనీయులని డచ్చస్‌ క్లబ్‌ వ్యవస్థాపకురాలు, హోటల్‌ సవేరా మేనేజింగ్‌ డైరెక్టర్‌ నీనారెడ్డి శ్లాఘించారు. మహిళా సాధికారత, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న డచ్చస్‌ క్లబ్‌ ప్రతినెలా ఒక ప్రముఖుడితో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జూన్‌ నెల విశిష్ట అతిధిగా ఆర్కాట్‌ నవాబు దాదా మహమ్మద్‌ ఆసిఫ్‌ అలీని ఆహ్వానించి జూమ్‌  సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్బంగా నీనారెడ్డి మాట్లాడుతూ, ఆర్కాట్‌ నవాబుల్లో రాజదర్పమే కాదు, మానవతా విలువలూ మూర్తిభవించాయన్నారు. అనేక హిందూదేవాలయాల నిర్మాణాల్లో ఆర్కాట్‌ నవాబులది ప్రధాన పాత్ర ప్రశంసనీయమని అన్నారు. ఆర్కాట్‌ నవాబ్‌ ఆసిఫ్‌ అలి మాట్లాడుతూ, చెన్నై రాయపేటలోని ఆమీర్‌ మహల్‌ ఆనాటి ఆర్కాట్‌ నవాబుల వైభవ జీవితానికి, అభిరుచులకు నిలువుట్టద్దంగా నిలుస్తూ నేటికీ వర్ధిల్లుతోందని అన్నారు. అమీర్‌ మహల్‌లోని పూర్వీకుల తైలవర్ణ చిత్రాలు, మేనా (పల్లకి), షాండిలియర్స్‌ అందాలు వర్ణనాతీతమన్నారు.

సంవత్సరాలు గడుస్తున్నా చెక్కుచెదరని అందం అమీర్‌ మహల్‌ సొంతమని వర్ణించారు. తిరుచ్చిరాపల్లి జిల్లా శ్రీరంగం ఆలయం, చెన్నై మైలాపూర్‌ ఆలయంతోపాటూ పలు హిందూ దేవాలయాల నిర్మాణాలకు తన తాతముత్తా లు అందజేసిన సేవల గురించి ఆయన వివరించారు. ఆర్కాట్‌ నవాబుల విశేషాలు, అమీర్‌ మహల్‌ అందాలు తిలకించే భాగ్యం కల్పించిన ఆర్కాటు నవాబుకు డచ్చస్‌ క్లబ్‌ తరపున నీనారెడ్డి, అనుఅగర్వాల్‌ ధన్యవాదాలు తెలిపారు. డచ్చస్‌ ప్రతినిధులు సుజాత ముంద్రా, అను అగర్వాల్, అను సచ్చిదేవ్, రా«ధీ నీలకంఠన్‌ తదితర 100 మంది సభ్యులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు