Who Is Manu Gulati: మనసులు గెల్చుకున్న టీచరమ్మ.. ఆర్డీనరీ మాత్రం కాదండోయ్‌

29 Apr, 2022 14:17 IST|Sakshi

పాఠాలంటే బోరుగా ఫీలయ్యే ఈరోజుల్లో.. పిల్లలకు ఆసక్తికరంగా పాఠాలు చెప్పడం ఒక కళగా మారింది. ఆ కళను అవపోసిన టీచరమ్మే ఈ మను గులాటి. అదేనండీ పాఠం అయిపోగానే.. విద్యార్థినితో కలిసి హుషారుగా గంతులేసిందే.. ఆ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. హర్యాన్వి సంగీతానికి తన విద్యార్థినితో కలిసి హుషారుగా ఆమె వేసిన స్టెప్పులు, పిల్లలతో ఆమె వ్యవహరించిన తీరుకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అయితే ఆమె మామూలు ఇంగ్లిష్‌ టీచర్‌ మాత్రమే కాదండోయ్‌.

‘‘పాఠ్య బోధన అనేది విద్యార్థులకు విద్యను అందించడమే కాదు.. ఇతర ఉపాధ్యాయులకు కూడా మార్గదర్శకత్వం చేయడం. మను గులాటీ ఇందులో ఓ వెలుగు వెలిగారు. సాంకేతికతను ఉపయోగించడం, సంగీతం, నృత్యంలో ఆమెకు ఉన్న జ్ఞానంతో వినూత్న పద్ధతుల్లో బోధించడాన్ని రూపొందించారామె. అలాంటి వ్యక్తికి జాతీయ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నా’’. ఈ వ్యాఖ్యలు ఎవరివో కాదు.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్‌ సారాంశం.

► ప్రస్తుతం నెటిజన్ల మనుసులు గెల్చుకున్న మిస్‌ మను గులాటి ప్రొఫైల్‌ ఆషామాషీగా లేదు. ఢిల్లీలో పుట్టి పెరిగిన మను గులాటి.. 2004లో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టారు.

► 2011 నుంచి ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెబుతున్నారు. 2020లో జమీయా మలీయా ఇస్లామియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. 

 పిల్లలతో ఆమె సరదాగా, ప్రేమగా వ్యవహరిస్తుంటారు. వాళ్లు ఆస్వాదించదగ్గ రీతిలోనే పాఠాలు చెప్తుంటారామె. అందుకే విద్యార్థులకు ఫేవరెట్‌ టీచర్‌గా ఉన్నారామె. అంతేకాదు.. టీచింగ్‌ కెరీర్‌లోనే ఎన్నో అవార్డులు దక్కాయి ఆమెకు. 

► 2015లో.. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి నేషనల్‌ ఐసీటీ అవార్డు ఫర్‌ స్కూల్‌ టీచర్స్‌ ను అందుకున్నారామె. 

► 2018లో నేషనల్‌ టీచర్స్‌ అవార్డుతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి మెప్పు అందుకున్న టీచర్స్‌లో ఈమె ఒకరు. ఆపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా నుంచి గౌరవ సత్కారం అందుకున్నారు. 

► ఫుల్‌బ్రైట్‌ టీచింగ్‌ స్కాలర్‌షిప్‌ దక్కించుకున్న ఆమె.. అమెరికాలో పర్యటించి అక్కడి విద్యావ్యవస్థ, పాఠాలు చెప్పే తీరుపైనా అధ్యయనం చేసే అవకాశం దక్కించుకున్నారు. 

► గొప్ప ఉపాధ్యాయుడే.. గొప్ప విద్యార్థులను సమాజానికి అందించగలడు. ఇలాంటి ఎక్స్‌ట్రార్డినరీ టీచర్ల సపోర్ట్‌ ఉంటేనే.. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగి అద్భుతాలు సాధించగలరు.. మను గులాటి మీద ప్రస్తుతం పలువురు వెలువరుస్తున్న అభిప్రాయాలు ఇవి. 

సంబంధిత వార్త: వావ్‌ అమేజింగ్‌.. విద్యార్థినితో స్టెప్పులేసిన టీచర్‌!

మరిన్ని వార్తలు