సడలని రైతుల ఆత్మస్థైర్యం

7 Jan, 2021 04:52 IST|Sakshi
సింఘు సరిహద్దు వద్ద నినాదాలు చేస్తున్న రైతులు

వర్షాలు, ఎముకలు కొరికే చలిలోనూ ఆందోళనలు

సాక్షి, న్యూఢిల్లీ: ఎముకలు కొరికే చలి, అకాల వర్షాలు కురుస్తున్నా ఢిల్లీ సరిహద్దుల్లో 43 రోజులుగా అన్నదాతలు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు ఏమాత్రం వెనకడుగు పడే పరిస్థితులు కనిపించట్లేదు. నాలుగు రోజులుగా ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళనను విరమిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ, అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ విపరీతమైన చలిని సైతం తట్టుకుంటూ వర్షం నుంచి తప్పించుకొనేం దుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని ఆందోళన కొనసాగిస్తున్నారు.

బుధవారమే జరగాల్సిన ట్రాక్టర్ల ర్యాలీ వాతావరణం అనుకూలించకపోవడంతో నేటికి వాయిదా పడింది. 26న ఢిల్లీలో ట్రాక్టర్‌ మార్చ్‌ను కచ్చితంగా నిర్వహిస్తామని రైతు నేతలు తెలిపారు. ఈ ట్రాక్టర్‌ మార్చ్‌లో సుమారు 20 వేల మంది పాల్గొంటారని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రామ్‌రాజీ ధుల్‌ తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరగనున్న ఈ ట్రాక్టర్‌ పరేడ్‌లో పాల్గొనేందుకు çపంజాబ్, హరియాణాల్లోని వేలాది మంది రైతులు సిద్ధమవుతున్నారు. టిక్రీ, సింఘు, ఘాజీపూర్‌ సరిహద్దుల్లో ఇప్పటికే వందలాది ట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నాయి.

ర్యాలీలో పాల్గొనేందుకు మరిన్ని ట్రాక్టర్లను సమకూర్చుకునేందుకు రైతు నేతలు ప్రయత్నిస్తున్నారు. చర్చలపై, రైతుల సమస్యలను పరిష్కరించడంపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ విమర్శించింది. రేవారి వద్ద ఉన్న నిరసనకారులు, స్థానికుల మధ్య వివాదం సృష్టించేందుకు హర్యానా పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొంది. రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు ప్రారంభమయ్యాయని తెలిపింది.  పరిస్థితి ఇలాగే కొనసాగే పక్షంలో తమ పశువులను సైతం నిరసన స్థలికి తీసుకు వచ్చేందుకు వందలాదిమంది రైతులు సన్నాహాలు చేస్తున్నారు.

చర్చలు జరగాలన్నదే మా ఆకాంక్ష: సుప్రీం
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతోన్న రైతుల ఆందోళన విషయంలో పురోగతి లేదని సుప్రీంకోర్టు ఆందోళన వెలిబుచ్చింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ఈనెల 11న విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. ప్రభుత్వానికీ, రైతులకూ మధ్య చర్చలు జరగాలన్నదే తమ ఆకాంక్ష అని వ్యవసాయ చట్టాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే పేర్కొన్నారు. పరిస్థితిలో ఎటువంటి సానుకూల మార్పూ, పురోగతి కనిపించడం లేదని జస్టిస్‌ బాబ్డే వ్యాఖ్యానించారు. రైతు సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తోందని, త్వరలో సమస్యకు పరిష్కారం లభించే అవకాశముందని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ కోర్టుకు తెలిపారు.చర్చలను కొనసాగించాలని ఈ సందర్బంగా కోర్టు ప్రభుత్వాన్ని కోరింది.చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు పంజాబ్‌ సీఎం అమరీందర్‌ ప్రకటించారు.

మరిన్ని వార్తలు