Meghalaya: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐదుగురు ఎమ్మెల్యేల రాజీనామా

18 Jan, 2023 14:11 IST|Sakshi

అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కానున్న నేపథ్యంలో మేఘాలయలో అయిదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. బుధవారం తమ రాజీనామాను గవర్నరకు సమర్పించి యూనైటెడ్‌ డెమోక్రటిక్‌ పార్టీలో(యూడీపీ) చేరేందుకు సిద్ధమయ్యారు. రాజీనామా చేసిన వారిలో కేబినెట్‌ మంత్రి హిల్‌ స్టేట్‌ పిపుల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(హెచ్‌ఎస్‌పీడీపీ) ఎమ్మెల్యే రెనిక్టన్‌ లింగ్‌డో టోంగ్‌కార్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే షిత్లాంగ్‌ పాలే, సస్పెండెడ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మైరల్‌బోర్న్‌ సియోమ్‌, పిటి సాక్మీతో పాటు ఓ స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. అయితే ఈ పరిణామంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌, హెచ్‌ఎస్‌పీడీపీ పార్టీలకు ఎమ్మెల్యేలు లేకుండా పోయారు.

కాగా మేఘాలయలో ఈమధ్య కాలంలో పార్టీ ఫిరాయింపులు అధికమయ్యాయి. ఇప్పటి వరకు దాదాపు 18 మంది శాసనసభ్యులు సంబంధిత పార్టీలకు రాజీనామాలు సమర్పించారు. ఇదిలా ఉండగా మార్చి 15తో మేఘాలయ 11వ అసెంబ్లీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో మూడు ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ ప్రకటించనుంది. 

ఇక మేఘాలయ డెమోక్రటిక్ అలయెన్స్ పేరుతో  ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన బీజేపీ ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. దీనికితోడు తాము కూడా ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ పేర్కొంది. 60 అసెంబ్లీ స్థానాలున్న మేఘాలయలో మెజార్టీ మార్కును దాటగలమని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా 2018లో ఎన్‌సీపీ (20), యూడీపీ (8), పీడీఎఫ్‌ (4), హెచ్‌ఎస్‌పీడీపీ (2), బీజేపీ (2), ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి(మొత్తం 39) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది.  నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ అధినేత కాన్రాడ్ సంగ్మా ప్రస్తుతం మేఘాలయ సీఎంగా ఉన్నారు.
చదవండి: ట్రైన్‌లో గర్భిణీకి పురిటి నొప్పులు.. ప్రసవం చేసిన హిజ్రాలు.

మరిన్ని వార్తలు