బీజేపీ గెలుపు కోసమే టీఎంసీ ప్రయత్నం.. దీదీ పార్టీపై రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు

22 Feb, 2023 18:40 IST|Sakshi

షిల్లాంగ్‌:  భారత్‌ జోడో యాత్ర ముగించిన కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ.. దేశంలో వరుసగా జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించారు. తాజాగా ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలో కాంగ్రెస్‌ గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో తృణమూల్‌ కాంగ్రెస్‌పైనా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. 

షిల్లాంగ్‌లో ఇవాళ(బుధవారం) ప్రచార సభలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ.. బీజేపీతో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌పైనా సంచలన ఆరోపణలు చేశారు. టీఎంసీ చరిత్ర ఏంటో మీ అందరికీ తెలుసు. పశ్చిమ బెంగాల్‌లో హింస, కుంభకోణాలకు కారణమైంది. అలాగే వాళ్లు అనుసరిస్తున్న పద్దతులను కూడా చూస్తున్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం భారీగా ధనం వెచ్చించింది ఆ పార్టీ. ఆ ఆలోచన బీజేపీకి కలిసొచ్చింది. ఇప్పుడు మేఘాలయాలోనూ అదే వైఖరి అవలంభిస్తోంది టీఎంసీ. మేఘాలయాలో బీజేపీని బలోపేతం చేయడానికి, అధికారంలోకి తేవడానికే టీఎంసీ తీవ్రంగా యత్నిస్తోంది అని ఆరోపించారాయన. అలాగే.. 

బీజేపీది అణచివేత ధోరణి గల పార్టీగా అభివర్ణించిన రాహుల్‌ గాంధీ.. ఆ పార్టీ తనకు ప్రతీది తెలుసని, ఎవరినీ గౌరవించదని చెప్పారు. అందుకే సమిష్టిగా బీజేపీ-ఆరెస్సెస్‌లపై పోరాడాలని ఆయన బహిరంగ సభకు హాజరైన ప్రజానీకానికి పిలుపు ఇచ్చారు. బీజేపీ నుంచి మేఘాలయ భాష, సంస్కృతి, చరిత్రకు హాని జరగకుండా కాంగ్రెస్‌ పార్టీ కాపాడుతుందని చెప్పారాయన. అలాగే మేఘాలయా ప్రభుత్వం పీకలలోతు అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారాయన.

ఇదిలా ఉంటే ఫిబ్రవరి 27వ తేదీన మేఘాలయా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. కౌంటింగ్‌, ఫలితాలు మార్చి 2వ తేదీన వెల్లడికానున్నాయి.

మరిన్ని వార్తలు