మేఘాలయలో ముక్కోణం

31 Jan, 2023 03:50 IST|Sakshi

 కదన రంగంలో ఎన్‌పీపీ, తృణమూల్‌ కాంగ్రెస్, కాంగ్రెస్‌

పాత ప్రత్యర్థులు కాన్రాడ్, ముకుల్‌ సంగ్మా మధ్య హోరాహోరీ  

ఈశాన్య భారత్‌లో గిరిజన ప్రాబల్యం కలిగిన మేఘాలయాలో శాసనసభ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. 60 అసెంబ్లీ స్థానాలున్న మేఘాలయలో ఫిబ్రవరి 27న ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 2న ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో పాత ప్రత్యర్థులైన కాన్రాడ్‌ సంగ్మా, ముకుల్‌ సంగ్మా మళ్లీ హోరాహోరీగా తలపడుతున్నారు. 2018 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నేతృత్వం వహించి, 21 స్థానాల్లో పార్టీని గెలిపించిన మాజీ ముఖ్యమంత్రి ముకుల్‌ సంగ్మా ఈసారి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ) నుంచి బరిలోకి దిగుతుండడం ఆసక్తి కలిగిస్తోంది.

కిందటిసారి పోటీలో లేని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా పోరాడుతుండడం విశేషం. 2018లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించి, అధికార పీఠానికి దగ్గరగా వచ్చిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో సిట్టింగ్‌ అభ్యర్థులంటూ ఎవరూ లేకపోవడం గమనార్హం. ఎన్నికల్లో ఎన్‌పీపీకి కాన్రాడ్‌ సంగ్మా, తృణమూల్‌ కాంగ్రెస్‌కు ముకుల్‌ సంగ్మా, కాంగ్రెస్‌కు విన్సెంట్‌ పాలా, బీజేపీకి ఎర్నెస్ట్‌ మారీ నాయకత్వం వహిస్తున్నారు. ప్రధానంగా ఎన్‌పీపీ, తృణమూల్‌ కాంగ్రెస్, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోరు సాగుతోంది.  అంతర్గత లుకలుకలతో అధికార మేఘాలయ ప్రజాస్వామ్య కూటమి(ఎండీఏ) కూటమి విచ్ఛిన్నమైంది.

కూటమిలోని నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ), భారతీయ జనతా పార్టీ(బీజేపీ), యునైటెడ్‌ డెమొక్రటిక్‌ పార్టీ(యూడీపీ), హిల్‌ స్టేట్‌ పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ(హెచ్‌ఎస్‌పీడీపీ), పీపుల్స్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(పీడీఎఫ్‌) ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. ఎండీఏలో అతిపెద్ద పార్టీ అయిన నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ) నేత, ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా మరోసారి కుర్చీ దక్కించుకోవడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకవేళ ఆ పార్టీ గెలిస్తే మేఘాలయలో 2013 తర్వాత వరుసగా రెండోసారి అధికారం దక్కించుకున్న తొలి పార్టీగా ఎన్‌పీపీ రికార్డుకెక్కుంది.   

18 మంది రాజీనామా  
2018లో కేవలం 20 సీట్లు గెలుచుకున్న ఎన్‌పీపీ.. యూడీపీ(6 సీట్లు), హెచ్‌ఎస్‌పీడీపీ(2 సీట్లు), పీడీఎఫ్‌(4 సీట్లు), బీజేపీ(2 సీట్ల)తోపాటు ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత ఎమ్మెల్యేల గోడదూకుళ్లు తదితరాలతో బలాబలాలు మారుతూ వచ్చాయి. 2021 నవంబర్‌లో ముకుల్‌ సంగ్మా నేతృత్వంలో 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు సైతం పార్టీ నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలు లేకుండాపోయారు. ఇటీవలే 18 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు, సొంత పార్టీలకు రాజీనామా చేశారు.

టిక్కెట్లపై హామీ ఇచ్చే పార్టీలో చేరి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తృణమూల్‌లో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలూ వీరిలో ఉన్నారు. గిరిజన రాష్ట్రమైన మేఘాలయకు ప్రత్యేక హోదా ఉంది. దాంతో రాష్ట్రంలో ఖర్చు చేసే నిధుల్లో 90 శాతానికిపైగా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుంటాయి. సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడి రాజకీయాలను చాలావరకు ప్రభావితం చేస్తూ ఉంటుంది. చిన్నాచితక పార్టీలు ఏదో ఒక నినాదంతో ఎన్నికల్లో పోటీ చేయడం, ఒకటో రెండో స్థానాలు గెలుచుకొని, ఫలితాల అనంతరం నెంబర్‌ గేమ్‌లో వీలైనంత మేరకు లబ్ధి పొందడం పరిపాటిగా మారింది.

 మళ్లీ మాదే అధికారం: ఎన్‌పీపీ  
మిత్రపక్షంగా ఉన్న బీజేపీ రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ఆటంకాలు సృష్టించిందని, అందుకే ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నామని ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా తేల్చిచెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకత ఏమాత్రం లేదని, తాము మళ్లీ నెగ్గడం ఖాయమని ఎన్‌పీపీ రాష్ట్ర అధ్యక్షుడు డబ్ల్యూ.ఖార్‌లుఖీ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.  

ప్రభావితం చేసే అంశాలేమిటి?  
ప్రభుత్వ వ్యతిరేకత: కాన్రాడ్‌ సంగ్మా సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోవడం, విచ్చలవిడిగా అవినీతి జరుగుతుండడం, నిధుల లేమితో ఆరోగ్య రంగం కునారిల్లుతుండడం ప్రభుత్వానికి ప్రతికూలంగా మారింది.  
 
సరిహద్దు రగడ:  మేఘాలయ–అస్సాం నడుమ సరిహద్దు వివాదం రగులుతోంది. రెండు రాష్ట్రాల్లో సరిహద్దులో ఉన్న పలు తెగల మధ్య హింసాకాండ చోటుచేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని జనం ఆరోపిస్తున్నారు.  
కూటమి విచ్ఛిన్నం:  అధికార మేఘాలయ ప్రజాస్వామ్య కూటమి(ఎండీఏ) కూటమి విచ్ఛిన్నమై, పార్టీలు సొంతంగా పోటీ చేస్తుండడం ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మాకు నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

మరిన్ని వార్తలు