మా వద్ద 50% పైగా రిజర్వేషన్లు సబబే

25 Mar, 2021 03:12 IST|Sakshi

సుప్రీంకోర్టుకు విన్నవించిన మేఘాలయ

న్యూఢిల్లీ: రాష్ట్రంలో 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడాన్ని మేఘాలయ బుధవారం సుప్రీంకోర్టులో సమర్ధించుకుంది. 85% పైగా గిరిజనులు ఉన్న తమ రాష్ట్రంలో ఆ స్థాయి రిజర్వేషన్లు అవసరమని పేర్కొంది. మరాఠాలకు మహారాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను, ఇంద్ర సాహ్ని కేసులో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ 1992లో సుప్రీంకోర్టు ఇచ్చి తీర్పును పునఃపరిశీలించే అంశాన్ని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తున్న విషయం తెలిసిందే. ఆ ధర్మాసనం ముందు మేఘాలయ తరఫున ఆ రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ అమిత్‌ కుమార్‌ బుధవారం వాదనలు వినిపించారు.

మేఘాలయ అనేక ప్రత్యేకతలు, వైవిధ్యత ఉన్న రాష్ట్రమని, అందువల్ల అసాధారణ పరిస్థితుల్లో అక్కడ 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడం సరైనదేనని కోర్టుకు వివరించారు. ఇంద్ర సాహ్ని కేసును పునః పరిశీలించాల్సిన అవసరం లేదని అమిత్‌ కుమార్‌ కోర్టుకు తెలిపారు. పలు ఇతర రాష్ట్రాలు కూడా తమ వాదనలను వినిపించాయి. వాదనల అనంతరం విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే చట్టబద్ధ హక్కు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉందని మంగళవారం కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయం రాజ్యాంగబద్ధమేనని, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల(ఎస్‌ఈబీసీ) జాబితాను రాష్ట్రాలు ప్రకటించే అధికారాన్ని 102వ రాజ్యాంగ సవరణ తొలగించదని వివరించింది.

మరిన్ని వార్తలు