మెహబూబా నిర్బంధం మరో 3 నెలలు

1 Aug, 2020 06:52 IST|Sakshi

శ్రీనగర్‌: పీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నిర్బంధాన్ని జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం మరో 3 నెలలు పొడిగించింది. గత ఏడాది ఆగస్టులో కశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన సందర్భంగా ప్రజా భద్రత చట్టం కింద నిర్బంధంలోకి తీసుకున్న వారిలో మెహబూబా కూడా ఒకరు. ఆగస్టు 5వ తేదీ నాటికి ఆమె నిర్బంధకాలం ఏడాది పూర్తవుతుంది. దీంతో, మెహబూబా గృహ నిర్బంధాన్ని మరో 3 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం ఆమె తన అధికార నివాసం శ్రీనగర్‌లోని ఫెయిర్‌వ్యూ బంగళాలో ఉన్నారు. మరోవైపు, జమ్మూకశ్మీర్‌ పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ సజ్జాద్‌ గనీ లోన్‌ను శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విషయాన్ని లోన్‌ కూడా ట్విట్టర్‌ ద్వారా నిర్ధారించారు. ఆయన కూడా దాదాపు ఏడాదిపాటు నిర్బంధంలో ఉన్నారు. పలువురు ప్రధాన రాజకీయ నేతలు సహా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అగ్ర నేతలు ఫరూఖ్‌ అబ్దుల్లా ఆయన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లా ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే.  
 

మరిన్ని వార్తలు