Mehul Choksi: గర్ల్‌ఫ్రెండ్‌తో డిన్నర్‌కు వెళ్లి చిక్కాడు

31 May, 2021 03:23 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆంటిగ్వాలోని తన సురక్షితస్థావరాన్ని వదిలి గర్ల్‌ఫ్రెండ్‌ను పొరుగునున్న డొమినికా దేశానికి డిన్నర్‌కు తీసుకెళ్లడమే మెహుల్‌ చోక్సీ పట్టివేతకు దారితీసింది.  ప్రస్తుతం ఆయన కరీబియన్‌ ద్వీప దేశం డొమినికాలో జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. ‘గర్ల్‌ఫ్రెండ్‌తో సరదాగా గడుపుదామనో, డిన్నర్‌ కోసమో చోక్సీ ఆమెతో కలిసి డొమినికాకు బోటులో వెళ్లాడు. అక్కడ పోలీసులకు దొరికిపోయాడు. అదే ఆయన చేసిన పెద్ద తప్పు.

ఎందుకంటే ఆంటిగ్వాలో ఉంటే ఇక్కడి పౌరుడు కాబట్టి ఆయనకు రక్షణ ఉంటుంది. మేము  చోక్సీని భారత్‌కు అప్పగించలేం’ అని ఆంటిగ్వా– బార్బుడా ప్రధానమంత్రి గాస్టన్‌ బ్రౌనే అన్నారు. జూన్‌ 2న కేసు తదుపరి విచారణకు వచ్చేదాకా  చోక్సీని డొమినికాలోనే ఉంచాలని అక్కడి హైకోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలు భిన్నంగా ఉంటే తప్పితే... చోక్సీని డొమినికా ప్రభుత్వం భారత్‌కే అప్పగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

డొమినికాకు ప్రైవేట్‌ జెట్‌ 
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు రూ.13,500 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పరారైన వజ్రాల వ్యాపారి మెహుల్‌  చోక్సీ (62)ని వెనక్కి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. చోక్సీ ఆర్థిక నేరాలకు సంబంధించిన పత్రాలను భారత్‌ ఈనెల 28న ఒక ప్రైవేట్‌ జెట్‌ విమానంలో డొమినికాకు పంపింది. పీఎన్‌బీ కుంభకోణం కేసులో మేనల్లుడు నీరవ్‌ మోదీతో కలిసి చోక్సి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు