మహిళా కాలేజీలోకి పోకిరీలు.. గోడ దూకి రచ్చ రచ్చ.. వీడియో వైరల్‌!

17 Oct, 2022 09:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని మిరాండా హౌస్‌ మహిళా కళాశాలలో ఈనెల 14న నిర్వహించిన దీపావళి మేలా ఉద్రిక్తతంగా మారింది. క్యాంపస్‌లో వేడుకలు జరుగుతున్న క్రమంలో కళాశాల వద్దకు చేరుకున్న పదుల సంఖ్యలో పోకిరీలు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా నినాదాలు చేయటం, గోడలు, గేట్లు దూకి లోపలికి వెళ్లిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీపావళి వేడుక ప్రారంభమైన ఒక గంట సమయంలోనే.. మహిళా కళాశాల చుట్టూ పెద్ద పెద్ద క్యూలైన్లు కనిపించాయి. పోకిరీలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. వారిని నిలువరించలేమని గ్రహించిన కళాశాల యాజమాన్యం అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది.  

‘క్యాంపస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా యాజమాన్యం వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో చాలా మంది పురుషులు ఆగ్రహంతో రెచ్చిపోయారు. లోపలికి అనుమతించాలని అసభ్యకరంగా నినాదాలు చేశారు. గోడలు, గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ‍ప్రయత్నిస్తున్న వీడియోలు భయానకంగా కనిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు భయంతో వణికిపోయారు. లోపలికి ప్రవేశించిన కొందరు మహిళల తరగతి గదుల వంటి నిషేధిత ప్రాంతాలను ఆక్రమించారు. ప్రొఫెసర్స్‌, స్టాఫ్‌ మాటలను సైతం లెక్కచేయలేదు. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. కళాశాలలో ఇష్టానుసారం వ్యవహరించారు.’ అని కళాశాల విద్యార్థి సంఘం ఓ ప్రకటన చేసింది. పురుషులు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించటం, వేధింపులకు పాల్పడటాన్ని ఖండిస్తున్నట్లు తెలిపింది. క్యాంపస్‌లోకి వచ్చిన పోకిరీలు.. అక్కడి మహిళలను తమ కోరికలు తీర్చే వస్తువులుగా పేర్కొన్నారని, దాంతో విద్యార్థినులు భయంతో పరుగులుతీసినట్లు తెలిపింది.

సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్‌గా మారిన క్రమంలో పోలీసులు రంగంలోకి దిగారు. వీడియోల ఆధారంగా సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తాజాగా ప్రకటించారు. ఈ సంఘటన అక్టోబర్‌ 14న జరిగినట్లు తెలిపారు. 

ఇదీ చదవండి: నయనతార, విఘ్నేష్‌ సరోగసీ వివాదానికి తెర!

మరిన్ని వార్తలు