పట్టపగలే యూపీలో దారుణం.. షాకింగ్‌ వీడియో​

26 Sep, 2022 16:24 IST|Sakshi

బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో రోజురోజుకూ మహిళలపై దాడులు, హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. రెండు క్రితమే యూపీలో కొందరు వ్యక్తులు ఓ మహిళకు మద్యం తాగించి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన మరువకముందే మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మతిస్థిమితం సరిగాలేని ఓ యువతి పట్ల కొందరు వ్యక్తులు అనుచితంగా ప్రవర్తించారు. 

ఈ ఘటనపై మీరట్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దౌరాలా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సెప్టెంబర్‌ 19వ తేదీన కొందరు వ్యక్తులు పట్టపగలే ఓ యువతిని దారుణంగా కొట్టారు. ఇద్దరు వ్యక్తులు.. ఆమె కాళ్లు, చేతులను పట్టుకుని ఈడ్చుకెళ్లారు. అనంతరం, వారు ఆమెపై దాడి చేశారు. ఈ క్రమంలోనే బాధితురాలు సహాయం కోసం వేడుకుంది. తనను వదిలేయాలని గట్టిగా అరుస్తూ కేకలు వేసింది. ఈ ఘటన సందర్భంగా చుట్టుపక్కలు చాలా మంది ఉన్నప్పటికీ ఆమెను ఎవరూ కాపాడలేదు. ఆమెపై దాడిని కొందరు మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేశారు. తాజాగా ఈ వీడియో పోలీసులకు చేరింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం బాధితురాలికి బరేలీలోని ఆసుప్రతిలో వైద్య చికిత్సలు అందిస్తున్నామని అన్నారు.

ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితమే యూపీలోని బదోస్ రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగింది. బాధితురాలికి తెలిసిన వ్యక్తి ఆమెను.. తన భర్త పిలుస్తున్నాడని చెప్పి ఆమెను గ్రామ శివారులోని చెరువు వద్దకు తీసుకువెళ్లాడు.అప్పటికే అక్కడ మరో ముగ్గురు యువకులు ఉన్నారు. వారంతా తనకు తెలిసిన వారే కావడంతో మాట్లాడింది. అనంతరం, నిందితులు ఆమెతో బలవంతంగా మద్యం తాగించారు. ఆ తరువాత వరుసగా ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు. దీంతో, కొన్ని రోజులు మౌనంగా బాధను దిగమింగిన మహిళ.. చివరకు ధైర్యం చేసి భర్తకు జరిగిన విషయం చెప్పింది. అనంతరం, వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు. 

మరోవైపు.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా డేటా ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో 2022 జనవరి నుండి ఆగస్టు వరకు మహిళలపై నేరాలకు సంబంధించి మొత్తం 56,083 కేసులను నమోదు చేసింది, ప్రతి లక్ష జనాభాకు 50.5 నేరాల రేటుగా నమోదైంది. మహిళలపై నేరాలకు సంబంధించి దాదాపు 31,000 ఫిర్యాదులు గత ఏడాది జాతీయ మహిళా కమిషన్ (NCW)కి అందాయి. యూపీలో 2020తో పోలిస్తే 2021లో మహిళలపై నేరాల ఫిర్యాదులు 30 శాతం పెరిగాయి.

మరిన్ని వార్తలు