ఏకీకృత మున్సిపల్ కార్పొరేషన్ బిల్లుకు ఆమోదం

22 Mar, 2022 16:31 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని మున్సిపల్‌​ కార్పొషన్‌ ఎన్నికలు ప్రకటించడానికి ఒక గంట ముందు ఎన్నికలను వాయిదా వేయాలంటూ బీజేపీ ఎన్నికల సంఘానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీంతో ఆప్‌ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇలా ఎ‍ప్పుడూ జరగలేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఆయన ఇది దేశ ప్రజాస్వామ్యానికి ముప్పు అని కూడా వ్యాఖ్యానించారు. అయినా గత ఏడేనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ అప్పడే ఎందుకు మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లను విలీనం చేయలేదని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో అనూహ్యంగా కేంద్రం మంగళవారం మూడు మున్సిపల్‌ కార్పొరేషన్ల విలీన ప్రతిపాదన బిల్లును ఆమోదించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేగాదు వచ్చేవారం ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు ఉన్న తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనే మూడు పౌర సంస్థలకు బదులుగా ఒకటి మాత్రమే ఉంటుంది. అయితే ఆప్‌ మాత్రం బీజేపీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎ‍న్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ఈ ఎత్తుగడ వేస్తోందంటూ ఆరోపణలు చేస్తోంది.

కానీ ప్రభుత్వ వర్గాలు ప్రతి కార్పొరేషన్‌కి సంబంధించి ప్రాదేశిక విభజనలు, ఆదాయాన్ని ఇచ్చే సంభావ్యత పరంగా కార్పొరేషన్ త్రివిభజన అసమానంగా ఉన్నందున ఈ విలీన బిల్లు చాలా అవసరం అని నొక్కి చెప్పింది. అంతేగాక మున్సిపల్ కార్పొరేషన్లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోందని, పైగా అవి ఉద్యోగులకు సకాలంలో జీతాలు,  పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించలేని స్థితిలో ఉండటం వల్లే  ఢిల్లీలోని పౌర సేవల నిర్వహణలో తీవ్రమైన ఆటంకాలు ఏర్పడుతున్నాయని వివరించింది. అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సవరణ చట్టం, 1911 ప్రకారం 2011లో ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ మూడు మున్సిపల్ కార్పొరేషన్‌లుగా విభజించారు. కానీ ప్రస్తుతం చట్టంలోని సవరణలతో మూడు కార్పొరేషన్లను ఉపసంహరించి ఏకీకృత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీని ఏర్పాటు చేయనుందని అధికారిక వర్గాలు తెలిపాయి.

(చదవండి: ట్విస్ట్‌ ఇచ్చిన అఖిలేష్‌.. ‘యోగితో ఇక తాడో పేడో తేల్చుకుంటా’)

మరిన్ని వార్తలు