అగ్నిపథ్‌ ఆందోళనలు.. కేంద్ర హోం శాఖ సంచలన నిర్ణయం

18 Jun, 2022 09:49 IST|Sakshi

అగ్నిపథ్‌ స్కీమ్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో నిరసనకారులు రైళ్లను తగలబెట్టడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అ‍గ్నివీర్లకు రిజర్వేషన్లు కల్పించనున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సీఏపీఎఫ్‌(Central Armed Police Forces), అసోం రైఫిల్స్‌లో అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు కేంద్రం తెలిపింది.


'అగ్నిపథ్' కింద ఆర్మీకి ఎంపికై నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి..  కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సామ్ రైఫిల్స్‌లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని వెల్లడించింది. ఈ రెండు దళాల్లో నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని అగ్నివీరులకు 3 ఏళ్ల పాటు పెంచుతామని కేంద్రం తెలిపింది. అగ్నివీర్ తొలి బ్యాచ్ వారికి .. కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో గరిష్ట వయో పరిమితి 5 ఏళ్లు సడలింపు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. 

కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఇవే..
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమ బల్ (SSB), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG). ఈ బలగాలన్నీ కేంద్రహోంశాఖ పరిధిలోకి వస్తాయి. ఇక ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలు.. కేంద్ర రక్షణ శాఖ కింద ఉంటాయి. 

మరిన్ని వార్తలు